అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలతో రైతులు ఆందోళన చెందుతుంటే.. స్థానిక ఎంపీ బండి సంజయ్ గాలికి తిరుగుతున్నారంటూ తీవ్రంగా దుయ్యబట్టారు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు పొన్నం. డ్రాగన్ ఫ్రూట్, మస్క్ మిలన్ లాంటి దెబ్బతిన్న వాణిజ్య పంటలను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వడగళ్ల వానలతో మొక్కజొన్న, వరి పంట, మామిడితో పాటుగా లక్షల రూపాయల పెట్టుబడితో పండించే విలువైన వాణిజ్య పంటలు కూడా దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం మిగిల్చిందన్నారు.
ఈ అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ముఖ్యమంత్రితో పాటుగా సంబంధిత మంత్రులు, అధికారులు పంట నష్ట ప్రాంతాలను సందర్శించాలని, కంటి తుడుపు చర్యగా కాకుండా.. వరి, మొక్కజొన్న, కూరగాయలు లాంటి పంటలకు ఎకరానికి ఎక్కువ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని పొన్నం డిమాండ్ చేశారు. అలాగే డ్రాగన్ ఫ్రూట్, మస్క్ మిలన్ లాంటి వాణిజ్య పంటలు పండించే రైతులు ఈ రాష్ట్రంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారన్నారు. ఈ విధమైన ప్రత్యేక పంటలు పండించేవారికి భారీగా నష్టం పరిహారం అందించాలని చెప్పారు.
నష్టం ఎక్కడ జరిగినా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా పంజాబ్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ విధంగా అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జాతీయ విపత్తు కింద.. బీజేపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంటే, ఇక్కడి స్థానిక పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ మాత్రం గాలికి తిరుగుతున్నాడంటూ విమర్శలు చేశారు.
తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. దెబ్బతిన్న పంటలతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీటిపై క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్రమైన నివేదిక రూపొందించడం ద్వారా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్.