మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది అమ్మాయి అనే సినిమా. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో పూజా భలేకర్ వెండితెరకు పరిచయమౌతోంది. ఆమె నిజజీవితంలో కూడా మంచి మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలు. ఎన్నో టైటిల్స్ గెలిచింది. ఇప్పుడు అమ్మాయి సినిమాతో నటిగా మారింది.
అయితే.. ఈ సినిమాలో పూజా, మార్షల్ ఆర్ట్స్ మాత్రమే చూపిస్తే ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ.. ఎక్స్ పోజింగ్ కూడా చేసింది. బికినీ వేసుకొని బీచ్ లో పరుగులు పెట్టింది, ఫైట్స్ కూడా చేసింది. మార్షల్ ఆర్ట్స్ కు బికినీకి సంబంధం లేదు? మరి పూజా ఎందుకిలా చేసింది. దానికి ఆమె సూటిగా సమాధానమిచ్చింది.
“నాకు మార్షల్ ఆర్ట్స్ వచ్చు. అయితే ఈ సినిమాలో గ్లామర్ కూడా ఉండాలన్నారు. అందుకే నాకు నేనుగా గ్లామరస్ గా కనిపించేందుకు ప్రయత్నించాను. ఎందుకంటే ఈ సినిమా తరువాత నాకు మరిన్ని అవకాశాలు రావాలి. అందుకే నేను గ్లామర్ పరంగా అందంగా కనిపించాలని అనుకున్నాను. యాక్షన్, ఫిట్ నెస్, గ్లామర్ పరంగా నేను పర్ఫెక్ట్ అని చూపించాలనుకున్నాను. ఎక్స్ పోజింగ్ అయినా, యాక్షన్ అయినా ఏదైనా చేయగలను అని చెప్పదల్చుకున్నాను. అందుకే రెండింటిని బ్యాలెన్స్ చేశాను. ఓవైపు మార్షల్ ఆర్ట్స్ చేస్తూనే, మరోవైపు బికినీ వేశాను.”
ఇలా తన లక్ష్యం ఏంటో సూటిగా చెప్పింది పూజా భలేకర్. మార్షల్ ఆర్ట్స్ లో ఎన్నో టైటిల్స్ అందుకున్న తను, ఇకపై నటనను కెరీర్ గా తీసుకోవాలని భావిస్తున్నట్టు ప్రకటించింది. కేవలం తన పాత్రకు ప్రాధాన్యం ఉండే పాత్రలు మాత్రమే తనకు అక్కర్లేదని, ఫక్తు గ్లామరస్ హీరోయిన్ పాత్రలు కూడా చేస్తానని తెలిపింది. చూస్తుంటే.. ఈ అమ్మడు ఫుల్ క్లారిటీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టినట్టుంది.