తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న నూతన సచివాలయం భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ నెల 18వ తేదీలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. మొత్తం నిర్మాణం పూర్తికాకున్నా 18వ తేదీన పూజలు నిర్వహించేందుకు వీలుగా కొంత భాగాన్ని సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు.
దీంతో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెండు, మూడు మంత్రిత్వ శాఖల మంత్రుల కార్యాలయాల పూర్తికి కసరత్తు సాగుతోంది. ఇక ముఖ్యమంత్రి ఇంకా సీఎస్ కార్యాలయాలు ఇప్పటికే 90 శాతం పూర్తయినట్లు సమాచారం. పరిపాలన కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా భవనం పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయం పట్టవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ప్రభుత్వం ఈ నెల 18వ తేదీన పూజలు నిర్వహిస్తుందా.. లేదా అన్న విషయం త్వరలో ఖరారు కానుంది. నూతన సచివాలయం నిర్మాణానికి 2019 జూన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 617 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు. కొత్త సచివాలయాన్ని ఏడంతస్తుల్లో, 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. అయితే దిగువ భాగంలో ప్రధాన నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
అంతర్గతంగా తుది పనులు నడుస్తున్నాయి. కొన్ని అంతస్తుల్లో చాంబర్లను కూడా సిద్ధం చేశారు. త్వరలో ఫర్నీచర్ కూడా రాబోతుంది. భవనం వెలుపల ధోల్ పూర్ ఆగ్రా ఎర్రరాతిని బేస్ మెంట్ గా పరిచే పని జరుగుతోంది. అయితే భవనం పైన ప్రధాన ఆకర్షణగా నిర్మిస్తున్న పర్షియన్ శైలి గుమ్మటం పనులు ఇటీవలే మొదలయ్యాయి. దీన్ని హడావుడిగా నిర్మిస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని.. జాగ్రత్తగా చేపట్టాల్సి ఉంటుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.