స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు చేదు సంఘటన ఎదురైంది. ఇప్పటి వరకు ఎవరి మీద ఫిర్యాదు అంటూ ఎరగని ఆమె.. మొదటి సారి ఓ విమానయాన ఉద్యోగిపై చిర్రుబుర్రులాడింది. అసలు ఏం జరిగిందంటే… బుట్టబొమ్మ పూజా ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంటోంది.
ముంబై టు హైదరాబాద్.. అక్కడి నుంచి చెన్నై.. అటునుంచి బెంగళూరు.. అక్కడి నుంచి ముంబై.. ఇలా చక్కర్లు కొడుతోంది. తాజాగా ముంబై నుంచి హైదరాబాద్ కి విమాన ప్రయాణం చేసింది. అయితే.. సదరు ఇండిగో విమానంలో సంబంధిత సిబ్బంది ఒకరు దురుసుగా ప్రవర్తించారని అసహనం వ్యక్తం చేసింది.
సోషల్ మీడియాలో తనకు ఎదురైన సంఘటన ను వివరించింది పూజా. ‘విపుల్ అనే ఇండిగో సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారు.అహంకారం, అజ్ఞానంతో బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. సాధారణంగా ఇలాంటి విషయాలపై నేను ట్వీట్ పెట్టను. కానీ, ఇది చెప్పి తీరాల్సిందేనని అనిపించింది. అంత భయంకర సంఘటన ఇది’ అని పూజా ట్వీట్ లో పేర్కొంది.
బుట్టబొమ్మ ట్వీట్ పై ఇండిగో సంస్థ స్పందించింది. జరిగిన ఘటనపై క్షమాపణ కోరింది. ప్రయాణానికి సంబంధించిన వివరాలు వ్యక్తిగతంగా పంపించమని, వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే.. ఈ విషయంలో పూజా తీరును తప్పుబడుతున్నారు కొందరు. అతడి ఉద్యోగం పోతే కుటుంబం గురించి ఆలోచించావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.