మెగాస్టార్ చిరంజీవి డ్యాన్సులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే, మాస్ మహారాజా రవితేజకు కూడా! మరి, వీళ్ళిద్దరూ కలిసి స్టెప్పేస్తే? ఎలా ఉంటుంది? రేపు చూడాల్సిందే మరి! దర్శకుడు బాబీ అయితే ‘పూనకాలు లోడింగ్…’ అని అంటున్నారు.
చిరంజీవి కథానాయకుడిగా ఆయన వీరాభిమాని బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) తెరకెక్కిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఇప్పటి వరకు మూడు పాటలు విడుదల చేశారు. ఒకటి… ‘బాస్ పార్టీ’. అది ఆడియన్స్‌లోకి బాగా వెళ్ళింది. రెండోది… ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి’. ఇది మెలోడియస్‌గా ఉంది. మూడోది టైటిల్ సాంగ్. ఇప్పుడు నాలుగో పాటను విడుదల చేయడానికి రెడీ అయ్యారు.
ఇప్పటి వరకు విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ పాటలు చిరంజీవి మీద పిక్చరైజ్ చేసినవి. ఇప్పుడు విడుదల చేయబోయేది మెగా మాస్ సాంగ్. చిరుతో పాటు రవితేజ మీద పాటను తెరకెక్కించారు. ‘పూనకాలు లోడింగ్…’ అంటూ సాగే ఈ పాటను ఎండ్ ఎండ్ ధమాకాగా డిసెంబర్ 30న… అనగా రేపు విడుదల చేయనున్నారు. రెండు రోజుల ముందే ప్రేక్షకులకు న్యూ ఇయర్ వస్తుందని చిత్ర బృందం పేర్కొంది.
ఆల్రెడీ విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగులో చిరంజీవి స్టిల్స్, ‘గ్యాంగ్ లీడర్’ రోజులను గుర్తు చేశాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే… సినిమా రెడీ అయ్యింది. చిరంజీవి చూశారు కూడా! రొటీన్ సినిమాలా ఉందని అంటున్న ప్రేక్షకులకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. ”రాసుకోండి, ఇది రొటీన్ సినిమానే. కానీ, లోపల వేరుగా ఉంటుంది” అని చిరు చెప్పుకొచ్చారు. చిరంజీవి సరసన శృతి హాసన్ నటించిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా కేథరిన్ కనిపించనున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జనవరి 8న విశాఖలో ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. విశాఖలో ఫంక్షన్ అని చిరు కూడా కన్ఫర్మ్ చేశారు. మెగా ఫ్యాన్స్ కోసం సికింద్రాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్ వేయాలని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆలోచిస్తోందని తెలిసింది. భారీ ఎత్తున ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేశారట.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా… స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.