దళిత బంధుతో ఎస్సీల బతుకులను మార్చివేస్తానన్న ప్రకటనలతో జేజేలు కొట్టించుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. ఇతర వర్గాల్లోని నిరుపేదల వెతలే కనిపించడం లేదు. గూడులేని వారికి డబుల్ బెడ్‌రూం కట్టించి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెడతానని ఏడేళ్లుగా గొప్పలు చెప్పుకుంటున్న ఆయన.. ఎంత మందికి వాటిని ఇచ్చారో తెలియదుగానీ.. అర్హులైన వారికి, అత్యంత అవసరమైన వారికి మాత్రం మొండి చేయి చూపించారని మాత్రం అర్థమవుతోంది. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చే విషయంలో టీఆర్ఎస్ పనితీరు ఎలా ఉందో చెప్పే ఉదాహరణ ఒకటి మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది. ఉండటానికి ఇళ్లులేక.. సర్కార్ తమ సమస్యను పట్టించుకోక మరుగుదొడ్డినే నివాసంగా మార్చుకుంది ఓ కుటుంబం.
ఈ ఫోటో చూశారా.. చూడగానే కడుపులో తిప్పుతున్నట్టుగా అనిపించడం లేదూ. ఇలా మరుగుదొడ్డిలో కుటుంబాన్ని వెళ్లదీయాల్సిన దుస్థితి ఈ కుటుంబానికి వచ్చింది. మండలం తిరుమలగిరికి చెందిన సుజాత కుటుంబం పడుతున్న పాట్లు ఇవి. భర్త చనిపోయిన సుజాత తన ఇద్దరు పిల్లలు, అత్తతో కలిసి ఇందులో ఉంటోంది. ఒక్కరు మాత్రం తలదాచుకోగలిగే ఈ మరుగుదొడ్డిలో ఉంటూ.. ఎండకు, వానకు, చలికి తిప్పలు పడుతూ… రోజు నరకం అనుభవిస్తోంది ఈ కుటుంబం.
ఉప ఎన్నిక ఉన్న చోట.. అవసరం లేకపోయినా కమ్యూనిటీ హాళ్లు, కుల సంఘాలకు భవనాలను ఆగమేఘాల మీద మంజూరు చేసి.. పునాదులు లేపుతోంది ప్రభుత్వం. కానీ ఇలాంటి అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి మాత్రం మనసు రావడం లేదు.