చేత్తో తోస్తే పడిపోయే గోడలు.. తంతే పడిపోయే పిల్లర్లు… ఏంటి ఇవి అనుకుంటున్నారా..? కొత్తగా నిర్మిస్తున్న ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణం ఇది. ఇంతకీ ఇవి ఎక్కడంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ, వసతి భవనాన్ని కడుతున్నారు.
ఆ భవనాలు నాసిరకంగా ఉన్నాయని సమాచారం అందడంతో సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు నిర్మాణ పనులను పరిశీలించారు.
ఆయన చేతితో తోయగానే అక్కడి ఇటుక కట్టడాలు కూలిపోయాయి. యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రాణిగంజ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, హాస్టల్ భవనాన్ని స్థానిక ఎస్పీ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్కే వర్మ గురువారం సందర్శించారు. నాణ్యత లేని నిర్మాణాన్ని పరిశీలించిన ఆయన షాక్ అయ్యారు.
ఇటుక రాళ్లతో కట్టిన పిల్లర్, గోడలను ఎస్పీ ఎమ్మెల్యే ఒక్క చేతితో తోయగానే అవి కూలిపోయాయి. ‘ఇదీ నాలుగంతస్తుల భవనం నాణ్యత’ అని ఆయన అన్నారు. ‘ఇలాంటి నాసిరకం నిర్మాణ పనులు యువత భవిష్యత్తును నిర్మించవు. ఇది వారి మరణానికి ఏర్పాట్లు చేయడం లాంటిది. రాణిగంజ్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వ అవినీతి యంత్రాంగానికి నిదర్శనం’ అని ఆయన ట్వీట్ చేశారు. దాంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.
Advertisements
మరోవైపు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ‘బీజేపీ హయాంలో అవినీతి అద్భుతం. ఇంజినీరింగ్ కాలేజీ భవనాన్ని సిమెంట్ లేకుండా ఇటుకలతో నిర్మిస్తున్నారు’ అని విమర్శించారు.