పోప్ ఫ్రాన్సిస్‌కు ఇన్‌స్టాగ్రాం కష్టాలు ఇప్పట్లో తప్పేలా కనిపించడం లేదు. ఇటీవలే ఆయన ఇన్‌స్టా ఖాతా నుంచి నటాలియా గరిబొటొ అనే బ్రెజిల్ మోడల్ బికినీ ఫొటోకు లైక్ వచ్చింది. దీంతో ఈ వార్త గత నెల రోజుల కిందట సంచలనం సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోప్ ఒక మోడల్ బికినీ ఫొటోకు లైక్ కొట్టడమేమిటి ? అని అందరూ షాకయ్యారు. అయితే పోప్ ఇన్‌స్టా ఖాతాను మెయిన్‌టెయిన్ చేసే బృందంలో ఎవరో ఈ తప్పు చేసి ఉంటారని అనుకున్నారు. ఆ విషయమై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే సరిగ్గా అలాంటి పొరపాటే మళ్లీ చోటు చేసుకుంది.
తాజాగా పోప్ ఫ్రాన్సిస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి మరొక బికినీ మోడల్ ఫొటోకు లైక్ వచ్చింది. డిసెంబర్ 23న మార్గట్ అనే మోడల్ ఫొటోకు లైక్ వచ్చింది. దీన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో స్క్రీన్ షాట్ ద్వారా తెలియజేసింది. తన ఫొటోకు పోప్ ఫ్రాన్సిస్ లైక్ కొట్టారంటూ ఆమె చెప్పింది. అయితే పోప్ సోషల్ మీడియా బృందం మరోసారి ఖంగు తిన్నది.
uhhh the pope liked my picture? pic.twitter.com/b4hOj2vYHO
— Margot 🦊 (@margot_foxx) November 19, 2020
గతంలో బ్రెజిల్ మోడల్ ఫొటోకు ఎవరు లైక్ కొట్టారో ట్రాక్ చేసి చెప్పాలంటూ వాటికన్ వర్గాలు ఫేస్‌బుక్‌ను కోరాయి. దీంతో ఫేస్‌బుక్ ఈ సంఘటనపై విచారిస్తోంది. అయితే మళ్లీ అలాంటి సంఘటనే చోటు చేసుకోవడంతో వాటికన్ వర్గాలు తలపట్టుకుంటున్నాయి. పోప్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి అలా బికినీ మోడల్స్ ఫొటోలకు లైక్‌లు ఎవరు కొడుతున్నారు, ఇందులో సాంకేతిక సమస్య ఏదైనా ఉందా, లేదా ఎవరైనా కావాలనే ఇలా చేస్తున్నారా ? అనే విషయం అర్థం కావడం లేదు.
అయితే పోప్ సోషల్ మీడియా ఖాతాలను ఇతర బృందాలు మెయింటెయిన్ చేస్తాయి కనుక వారిలోనే ఎవరో ఒకరు ఈ చర్యకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ ఈ పనిచేస్తున్నది ఎవరు అనే విషయాన్ని మాత్రం కచ్చితంగా తెలుసుకోలేకపోతున్నారు. కాగా పోప్ ఫ్రాన్సిస్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ట్విట్టర్‌లో 18.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో అంతటి పేరు గాంచిన వ్యక్తి ఇలా వివాదాల్లో నిలుస్తుండడంతో వాటికన్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కానీ త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు.