సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు, తమిళ రచయిత భూపతిరాజా తండ్రి, పాపులర్ రైటర్ బాలమురుగన్ (86) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు భూపతిరాజా వెల్లడించారు.
ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.తమిళంతోపాటు పలు తెలుగు సినిమాలకు కూడా కథలు అందించారు బాలమురుగన్. ఆయన రాసిన కథల్లో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ సాధించాయి.
ధర్మదాత, ఆలుమగలు, సోగ్గాడు, సావాసగాళ్లు, జీవన తరంగాలు వంటి సినిమాలకు కథలు అందించారు బాలమురుగన్. అల్లు అరవింద్ కి చెందిన గీతా ఆర్ట్స్ మొదటి సినిమా `బంట్రోతు భార్య` సినిమాకు స్టోరీ అందించిన వ్యక్తి బాలమురుగన్.శోభన్‌బాబు హీరోగా తెరకెక్కిన `సోగ్గాడు` సినిమా ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలుసు.
ఈ సినిమాకు కూడా బాలమురుగనే స్టోరీ ఇచ్చారు. తమిళంలో ఒకప్పటి స్టార్ హీరో శివాజీ గణేశన్ సినిమాలకు కూడా ఎన్నో కథలు అందించి ఇండస్ట్రీ హిట్స్ లో భాగమయ్యారు బలమురుగన్. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.