కేంద్ర మంత్రి పాల్గొన్న ఓ కార్యక్రమంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. మంత్రి రామేశ్వర్ తేలి పాల్గొన్న కార్యక్రమంలో వేదిక వెనుక ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ లో అశ్లీల చిత్రానికి సంబంధించిన క్లిప్ ప్లే అయింది. దీంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
వివరాల్లోకి వెళితే… అసోంలోని తీన్ సుకియాలో మిథనాల్ బ్లెండెడ్ ఎమ్-15 పెట్రోల్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇందులో కేంద్ర మంత్రితో పాటు అసోం మంత్రి సంజయ్ కిషన్, నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీ.కే సారస్వత్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ లో నీలి చిత్రాల క్లిప్ ఒకటి ప్లే అయింది.
దీంతో అధికారులు ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకుని ప్రొజెక్టర్ ను ఆపివేశారు. అయితే అక్కడ జరిగినదంతా అప్పటికే కొందరు తమ స్మార్ట్ ఫోన్లలో రికార్డు చేశారు. కార్యక్రమాన్ని జూమ్ లో లైవ్ టెలికాస్ట్ చేయడంతో చాలా మంది దీన్ని వీక్షించారు.
కేంద్ర మంత్రి హాజరైన కార్యక్రమంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
జూమ్ లైవ్ లో కార్యక్రమాన్ని వీక్షించేందుకు కొంత మందికి ఐడీ, పాస్ వర్డ్ లను ఇండియన్ ఆయిల్ సంస్థ అధికారులు ఇచ్చారని పోలీసులు చెప్పారు. ఆ లాగిన్ వివరాలతో దుండగులు ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.