కుక్కలు విశ్వాసానికి మారు పేరు. సాధారణంగా అవి మహా అంటే 10 నుంచి 15 ఏళ్ల బతుకుతాయి. అంతకుమించి బతకలేవు. కానీ బాబీ అనేపేరుగల ఓ కుక్కు 30 ఏళ్ళ 266 రోజులు బతికింది. అంటే సుమారుగా 31 సంవత్సరాలు. అందుకే అత్యధిక వయసున్న శునకమహారాజుగా బాబీ గిన్నిస్ బుక్ లో చోటుచేసుకుంది.అంతే కాదు..అత్యంత ఎక్కువ వయసు కలిగి, బతికి ఉన్న కుక్కగా మరో రికార్డు క్రియేట్ చేసింది బాబీ.
ఇదివరకు ఈ రికార్డు బ్లూయే అనే కుక్క పేరు మీద ఉండేది. ఆ కుక్క 1910లో పుట్టి 1939లో చనిపోయింది. అంటే ఆ కుక్క 29 ఏళ్లు మాత్రమే బతికింది. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసి 30 ఏళ్ల బతికి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది బాబీ.
దీని పేరు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించి దానికి సర్టిఫికెట్ కూడా అందించారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు. బాబీ యజమానులు పోర్చుగల్‌లోని కాంకెయిరోస్ గ్రామానికి చెందిన కోస్టా కుటుంబం. ఈ కుటుంబంలోని లియోనెల్ కోస్టా అనే కుర్రాడికి 8 ఏళ్లున్నప్పుడు బాబీ పుట్టింది. ఇంట్లో చాలా పెంపుడు కుక్కలుండటంతో కొన్నింటిని వదిలి పెట్టినా ఇది మాత్రం తప్పించుకుంది.
‘‘ఇంట్లో వాళ్లు తినేది ఏం పెట్టినా బాబీ తినేది. అనారోగ్య సమస్యల్లేకుండా హుషారుగా ప్రశాంతంగా ఉండేది. అదే దాని ఆయుష్షును పెంచి ఉంటుంది’’ అంటారు కోస్టా. వయో భారంతో బాబీ ఇప్పుడు చురుగ్గా నడవలేకపోతోందట! చూపు కూడా తగ్గిందని కోస్టా చెప్పారు.