తెలంగాణలో కరోనా టెన్షన్ నెలకొంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 8 నుండి 16 వరకు విద్యాసంస్థలకు హాలిడేస్ ప్రకటించారు. అయితే.. వాటిని మరో నాలుగు రోజులు పొడిగించాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో 17వ తేదీ నుంచి విద్యాలయాలు తిరిగి తెర్చుకోవల్సి ఉంది. అయితే.. కరోనా సంక్రమణను దృష్టిలో ఉంచుకుని సెలవుల్ని పొడిగించాలనేది విద్యాశాఖ అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నివేదిక సమర్పించారట. ఈ నేపథ్యంలో ఈనెల 20 వరకు సెలవులు పొడిగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో కేసుల తీవ్ర అధికంగానే ఉంది. రోజువారీ కేసుల్లో పెరుగుదలే కానీ.. తగ్గుదల కనిపించడం లేదు. దీంతో కరోనా ఆంక్షలను ఈనెల 20 వరకు పొడిగించింది ప్రభుత్వం. దీనివల్ల రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తోంది. అలాగే స్కూల్స్ ను కూడా అప్పటి వరకు తెరవకుండా ఉంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
కరోనా స్పీడ్ చూస్తుంటే ఇంకో నాలుగు రోజులకు ఇంకా కేసులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. అప్పటి పరిస్థితుల్లో స్కూల్స్ ఓపెన్ అయితే.. విద్యార్థులు, వారిని దింపేందుకు వచ్చే పేరెంట్స్ తో రోడ్లు ఫుల్ కావడం ఖాయం. మళ్లీ రద్దీ పెరిగి వైరస్ వ్యాపిస్తుందని భావిస్తున్నారట అధికారులు. అందుకే సెలవులు పొడిగించాలని మంత్రికి నివేదిక పంపినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది.