ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈ రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ పోస్టర్లు, బ్యానర్లు వెలుస్తున్నాయి. బై.. బై.. మోడీ హ్యాష్ ట్యాగ్ తో ప్రింట్ చేసిన పోస్టర్లు నగరంలోని పలు ప్రాంతాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడుల పేరిట కవితను వేధింపులకు గురి చేస్తున్నాయని పోస్టర్లలో చెబుతున్నారు. ఎన్ని వేధింపులకు గురి చేసినా కవిత రంగులు మార్చ బోరంటూ అందులో ముద్రించారు. దర్యాప్తు సంస్థల దాడులకు భయపడి పలువురు నేతలు గతంలో రంగులు మార్చారని అందులో చెప్పారు.
అలా రంగులు మార్చిన నేతల ఫొటోలను అందులో ప్రింట్ చేశారు. ఆ పోస్టర్లలో ఏపీకి చెందిన సుజనా చౌదరీ, మహారాష్ట్రలో నారాయణ రాణే, పశ్చిమ బెంగాల్ నుంచి సువేందు అధికారి, అసోంలో హిమంత బిశ్వ శర్మ, మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాలపై దర్యాప్తు సంస్థలు దాడి చేశాయని పేర్కొన్నారు.
దాడుల అనంతరం వారి రంగు కాషాయంలోకి మారిందని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత వారిపై బీజేపీ చర్యలు తీసుకోలేదని పోస్టర్లలో వివరించారు. కానీ తెలంగాణకు చెందిన కవితను ఎన్ని వేధింపులకు గురిచేసినా ఆమె మాత్రం వారిలా రంగులు మార్చబోదని పేర్కొన్నారు.