ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని తన గానంతో మంత్ర ముగ్దులను చేసిన స్వరం మూగబోయింది. సంగీత అభిమానులను దు:ఖ సాగరంలో ముంచి వాణి జయరాం అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఆమె చెన్నైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తమిళంతో పాటు పలు భాషల్లో సంగీత ప్రియులను తన గానంతో అలరించారు ఆమె.
ఆమె సేవలకు మెచ్చి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించింది. ఆమె 1945 నవంబరు 30న జన్మించారు. తమిళనాడులోని వేలూరు ఆమె స్వగ్రామం. పద్మావతి, దొరైస్వామి ఆమె తల్లిదండ్రులు. వాణీ పుట్టగానే ఆమె తండ్రి ఆమె జాతకాన్ని ఓ సిద్దాంతికి చూపించగా, ఆమె భవిష్యత్‌లో మధుర గాయని అవుతారని చెప్పారట. దీంతో అప్పుడే ఆమెకు కలైవాణి అని పేరు పెట్టాలని సూచించారట. ఆ మాట విని ఆమె తండ్రి నవ్వుకున్నారు.
అయితే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. వంట మనిషి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే ఆమె చనిపోయి ఉన్నారు. కాగా పోస్టుమార్టమ్ పూర్తి చేసి ఆమె పార్థీవ దేహాన్ని చెన్నైలోని ఫ్లాట్ కు తరలించారు. ఆమెను కడసారిగా చూడ్డానికి భారీగా అభిమానులు తరలివస్తున్నారు. అయితే ఆమె నుదురు,తలపై గాయాలుండడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఈ క్రమంలో ఆమె బంధువులు, అభిమానులు పోస్టుమార్టమ్ రిపోర్ట్ గురించి ఎదురు చూస్తున్నారు. మరో వైపు చెన్నై పోలీసులు ఆమె ఇంటిని పూర్తిగా స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె శరీరం పై గాయాలు ఎలా అయ్యాయన్న కోణంలో విచారణ వేగవంతమైంది. అయితే పనిమనిషి వచ్చేటప్పటికే ఆమె ఇంటికి తాళం వేసి ఉండడం..ఆమె శరీరంపై గాయాలుండడం ఇప్పుడు మిస్టరీగా మారింది.