– జాతీయపార్టీకి కేసీఆర్ సన్నాహాలు
– మంత్రుల, ఎమ్మెల్యేలతో చర్చ
– టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలన్నదే ముఖ్య ఉద్దేశ్యం
– జూన్ నెలాఖరు వరకు ప్రకటించాలని నిర్ణయం
– రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వెనకడుగు
– మరో మూడు వారాలు వాయిదా వేసినట్టు సమాచారం
– జులై రెండో వారంలో ప్రకటన
– ఈ మూడు వారాలు ప్రముఖులతో చర్చ
– పూర్తి కసరత్తు తర్వాతే పార్టీ ప్రకటన
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వస్తోందనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ఇదంతా ప్రశాంత్ కిశోర్ వ్యూహంలో భాగమేనంటున్నారు కొందరు విశ్లేషకులు. ప్రజల్లో జరుగుతున్న చర్చలకు జీవంపోసే విధంగానే సీఎం పావులు కదుపుతున్నారు. ఇప్పటికే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యూహాలు అంతాఇంతా కాదు. ప్రజల్లో తన ఉనికిని కాపాడుకునేందుకు తన స్టైల్ లో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు సీఎం కేసీఆర్.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూనే తన పథకాలను ప్రజలకు తెలియజేసూ ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ శక్తి రావాల్సి ఉందని పదే పదే చెప్తున్న కేసీఆర్.. ఆ బాధ్యతలను తానే తీసుకోవాలని భావిస్తున్నాను అన్నట్టు బీజేపేతర పార్టీలను కలుపుకునే ప్రయత్నాల్లో బిజీ అయ్యారనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు.
కొత్త పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే ప్రకటన చేస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. తెలంగాణలో జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల కంటే ముందే పార్టీని ప్రకటిస్తారని వార్తలొచ్చాయి. కానీ.. తాజా రాజకీయాల నేపథ్యంలో కొత్త పార్టీని ప్రకటనను వాయిదా వేయాలని కేసీఆర్ భావిస్తున్నారనేది టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఇచ్చిన లీక్. కొత్త జాతీయ పార్టీ పెట్టుడు పక్కా.. కాకపోతే.. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏర్పాటు చేయాలనేది కేసీఆర్ వ్యూహంగా సమాచారం. ఈ నెలలోనే పార్టీ ప్రారంభించాలని భావించినప్పటికీ.. రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఇది అనుకూల సమయం కాదనే అభిప్రాయంతో ఆయన వెనకడుగు వేసినట్టు తెలిసింది.
రాష్ట్రపతి ఎన్నికలకు మరో మూడు వారాలకు పైగా గడువు ఉన్నందున.. అప్పటి వరకు కొత్త పార్టీకి సంబంధించిన కసరత్తు చేయాలని నిర్ణయించారంటున్నారు కేసీఆర్ సన్నిహితులు. జూన్ 10న ప్రగతిభవన్ లో అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ తో పాటు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఆ భేటీలో కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించారు. భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటు చేద్దామనే అలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకు గులాబీ నేతలంతా అంగీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
పార్టీ పేరు, జెండా, విధివిధానాలను ఖరారు చేశాక.. ఈ నెల 19న టీఆర్ఎస్ కార్యకర్గ సమావేశం ఏర్పాటు చేసి.. కొత్త జాతీయ పార్టీపై తీర్మానం చేయాలనేది తమ కార్యచరణగా పెట్టుకున్నారు కేసీఆర్. కానీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల గురించి చర్చ జరుగుతున్నందున.. కొత్త జాతీయ పార్టీని ఎన్నికల తర్వాతే ప్రకటించాలని సీఎం భావిస్తున్నారనేది విశ్వసనీయ సమాచారం. మరోవైపు కొత్త జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ కసరత్తు కొనసాగుతోంది. దేశంలోని ప్రముఖ ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
ఇటీవల గత గురువారం కూడా ప్రగతి భవన్‌లో ఓ సమావేశం జరిగింది. ఢిల్లీకి చెందిన ఆర్థిక నిపుణుల బృందంతో కేసీఆర్ చర్చించారు. శుక్రవారం జాతీయ మీడియా ప్రముఖులతోనూ భేటీ అయ్యారు. ఇలా పలు రంగాలకు చెందిన నిపుణులతో సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. వచ్చే నెల రెండో వారం వరకు ఈ చర్చలు కొనసాగుతాయని సమాచారం. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసే లోపు పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయంలో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేస్తే.. దేశ ప్రజలు ఆదరిస్తారా..? ఉరికురికి బోర్ల పడ్డట్టు కేసీఆర్ పని అవుతుందా..? అన్నట్టు ప్రజల్లో జోరుగా చర్చ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.