ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల వాయిదా పడింది. ఫలితాల విడుదలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పరీక్ష ఫలితాలను జూన్ 4, ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది.కాగా.. సాంకేతిక లోపాల కారణంగా ఫలితాల విడుదలను వాయిదా వేశామని అధికారులు తెలిపారు.
మరోవైపు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అందుబాటులో లేకపోవడంతో ఫలితాల విడుదలపై అధికారులు తర్జనభర్జన పడ్డారు. కాగా ఏపీ కేబినెట్ లో శాఖల మార్పు తర్వాత విద్యాశాఖ ద్వారా ప్రకటిస్తున్న తొలి ఫలితాలు ఇవే కావడంతో విద్యాశాఖ మంత్రి చేతులమీదుగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు విద్యాశాఖ సమన్వయ లోపమే ఫలితాల వెల్లడి జాప్యానికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం సుమారు 6 లక్షలమంది విద్యార్థులు నిరీక్షిస్తున్నారు.