తెలంగాణ సీనియర్ నేత డీ శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరే అంశం తెగటం లేదు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో చేరిక వాయిదా పడుతూ వస్తోంది. ఈ నెల 24న డీఎస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని గత కొన్ని రోజులుగా జరిగిన ప్రచారానికి మరోసారి బ్రేక్ పడింది. ముహూర్తం కట్టుకొని తీర్థానికి వెళ్తే.. ముక్కుడు పోలమ్మ ఎదురొచ్చింది అన్నట్టు తయారైంది డీఎస్ పరిస్థితి.
Advertisements
ఈసారి కరోనా వల్ల డీఎస్ చేరిక ఆగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏఐసీసీ కార్యాలయంలో కూడా వైరస్ వ్యాప్తి చెందినట్టు సమాచారం. దాంతో ఏఐసీసీ కీలక నేతలు కార్యాలయం వైపు రావడం లేదట. దాని కారణంగానే పార్టీలో డీఎస్ జాయినింగ్ వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. ఆయన చేరికపై గత కొంతకాలంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఆయన్ని పార్టీలోకి చేర్చుకోవడం ఇష్టం లేదని వార్తలు వినిపించాయి.
డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ కు బీజేపీలో సముచిత స్థానం దక్కడంతో డీఎస్ చేరిక పార్టీకి నష్టం కలుగుతుందని పీసీసీ సభ్యులు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. కానీ.. కొంతమంది మాత్రం ఆయన అనుభవం పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి ఉపయోగడుతోందని వాదిస్తున్నారట. అయితే.. ఈ వ్యవహారం ఇక్కడ తేలదని భావించిన డీఎస్ డైరక్ట్ గా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపినట్టు సమాచారం. సోనియా కూడా డీఎస్ చేరికకు సుముఖత వ్యక్తం చేశారని వినికిడి. దీంతో.. ఈనెల 24న పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు డీఎస్.
కానీ.. కరోనా కారణంగా మరోసారి జాయినింగ్ వాయిదా పడింది. డీఎస్ తో పాటు ఆయన పెద్ద కుమారుడు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నారు. మరో కుమారుడు ఎంపీ అరవింద్ తన తండ్రి పార్టీ మార్పుపై ఇటీవల స్పందించారు. ఆయన ఎక్కడ గౌరవం లభిస్తుందో అక్కడ చేరితే తప్పేంటని అన్నారు. ఈ విషయం ఆయన వ్యక్తిగతమని చెప్పారు.