వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ‘పోతిరెడ్డిపాడు’ ఒక హాట్ టాపిక్. పోతిరెడ్డిపాడు నుంచి ఒక బకెట్ నీళ్లు తీసుకెళ్లినా రక్తం చిందిస్తామని అప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా హెచ్చరించడం.. ఎవరెన్ని చెప్పినా లక్ష్యపెట్టకుండా వైఎస్ దానికి రెండవ రెగ్యులేటర్ నిర్మాణానికి పూనుకోవడం.. ఇది గతం.
ఈ పోతిరెడ్డిపాడు ఇప్పుడు కృష్ణమ్మ వరద ఉధ్రుతికి నిండుకుండగా మారి పొర్లుతోంది. పదిహేనేళ్ల తరువాత పూర్తి సామర్ధ్యానికి చేరుకున్న పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి ఇప్పుడు భారీగా నీటిని విడుదల చేశారు.
2004లో 11వేల క్యూసెక్కుల సామర్ధ్యం ఉన్న పోతిరెడ్డిపాడుకు వైఎస్ రెండవ రెగ్యులేటర్ కట్టించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర పది గేట్లు ఏర్పాటు చేశారు. దీనికోసం అప్పట్లో రూ.20 వేల కోట్లు వెచ్చించారు. దానివల్ల పోతిరెడ్డిపాడు సామర్ధ్యం 44 వేల క్యూసెక్కులకు పెరిగింది.
కృష్ణానది వరద సమయంలో 30 రోజుల్లో 114 టీఎంసీల నీటిని తరలించడం కోసం ఈ పనులు చేపట్టారు. ఇందులో తెలుగుగంగ కాలువకు 29 టీఎంసీలు, ఎస్ఆర్‌సికి 19 టీఎంసీలు, గాలేరు నగరికి 38 టీఎంసీలు, చెన్నై నగరం తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు అందించి, మిగిలిన జలాలను రాయలసీమ తాగునీటి అవసరాలకు ఉపయోగించాలని అప్పట్లో నిర్ణయించారు. 2006లో మొదలైన ఈ పనులు 2008లోనే పూర్తి కావాల్సి ఉంది. పనుల్లో తీవ్ర జాప్యం జరిగి 2012లో పూర్తిచేశారు. క్రమంగా కాలువ పనులు కూడా పూర్తవడంతో ఇప్పుడు నీటి తరలింపు సుసాధ్యమైంది.
ప్రస్తుతం ఎగువ రాష్ట్రాల నుంచి వరద పోటెత్తిరావడంతో పోతిరెడ్డిపాడు నుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇక్కడి నుంచి విడుదల చేసిన నీటిలో తెలుగుగంగకు 17 వేల క్యుసెక్కులు, నిప్పులవాగు ఎస్కేప్ చానల్‌కు 13వేల క్యుసెక్కులు చొప్పున నీటిని విదుదల చేస్తున్నారు. ఏ కాలువలో చూసినా ఇప్పుడు జలకళ ఉట్టిపడుతోంది. సమృద్ధిగా నీళ్ళు పారుతున్నాయి. హంద్రి-నీవా పూర్తి సామర్ధ్యంతో కనిపిస్తోంది.
2004లో పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచటాన్ని నిరసిస్తూ ప్రకాశం బ్యారేజి దగ్గర టీడీపీ నేత దేవినేని ఉమా మూడు రోజుల పాటు ధర్నా చేసిన విషయాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఆనాడు వైఎస్ పోతిరెడ్డిపాడు డిశ్చార్జ్ కెపాసిటీని 44 వేల క్యుసెక్కులకు పెంచకపోతే సీమకు నీళ్ళే దక్కేవి కాదని వారంటున్నారు. అప్పుడు పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచకపోయివుంటే ఇవాళ కరకట్ట తెగి చంద్రబాబు ఇంటిని వరద నీరు ముంచెత్తేదని ప్రస్తావిస్తున్నారు.