సామాజిక ఒరవడిని బట్టి జనంలోంచి ప్రతిభాషలోనూ కొన్ని కొన్ని పదాలు పుట్టుకొస్తాయి.తరలాలు మారినా, అవి జనంతో,భాషతో,యాసతో మమేకమైపోతాయి. వీటిని జనపథాలు అంటారు.వాటిలో సామెతలు,నుడి కారాలు, నిత్యసత్యాలు వగైరాలు ఉన్నాయి.
‘వీడికి నోట్లో నాలుక లేదు’, ‘ఆ మహానుభావుడి చేతికి ఎముక ఉండదు’, ‘నరుడి నోట్లో పడితే నల్లరాయైనా బద్దలవుతుంది’, ‘ఆడదాని నోట్లో నువ్వుగింజ దాగదు’, ‘వీడు నక్కతోక తొక్కాడ్రా’, ‘వీడు రోజూ నక్కమొహం చూస్తున్నాడురా’ లాంటి సామెతలన్నీఅలా పుట్టుకొచ్చినవే.
‘వీడు రోజూ నక్కమొహం చూస్తున్నాడురా’ అనే సామెతకు అంటే రోజూ నక్క మొహం చూస్తే అదృష్టం వరిస్తుందనే అర్థం వస్తుంది. ఓ వ్యక్తి ఈ సామెతని చాలా సీరియస్ గా తీసుకున్నాడు.
అందులో అంతర్లీనంగా అదృష్టం తిష్టవేసుకుని ఉందని ఏకంగా నక్క నే తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. అదృష్టమో..దురదృష్టమో గానీ, చివరకు కటకటాలపాలయ్యాడు.
కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలోని నాగవల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ అనే వ్యక్తి మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతాడు. లక్ష్మీకాంత్ కోళ్ల ఫామ్‌లు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ జీవించే వాడు.
అయితే, రోజూ ఉదయం నక్కముఖం చూస్తే అదృష్టం వరిస్తుందని భావించిన లక్ష్మీకాంత్ ఇంట్లో రెండు నక్క ఫొటోలను పెట్టుకున్నాడు. అయినా అదృష్టం కలిసి రాలేదని భావించి.. అడవికి వెళ్లి ఓ నక్కను తీసుకొచ్చి తన కోళ్లఫారంలో ఓ బోనులో పెట్టాడు.
రోజూ ఉదయం దాని ముఖం చూసేవాడు. పని మీద బయటకు వెళ్లాలంటే కచ్చితంగా నక్క ముఖం చూసే వెళ్లేవాడు. మొత్తానికి ఏం మేజిక్ జరిగిందో ఏమో కానీ..కాసుల వర్షం మొదలైంది. ఇతందా నక్క మహిమే అని నమ్మాడతను.
అయితే, కోళ్లఫారంలో నక్క ఉందని తెలుసుకున్న గ్రామస్థులు..ఒకరోజు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నక్కను పెంచుకోవడం నేరమంటూ లక్ష్మీకాంత్‌ను అరెస్ట్ చేశారు.
నక్కను అటవీశాఖ సిబ్బందికి అప్పగించారు. దీంతో ‘ఈ ఉదయం లక్ష్మీకాంత్ నక్క ముఖం చూడలేదేమో..అందుకే జైలుపాలయ్యాడు’ అంటూ గ్రామస్థులు గుసగుసలాడటం మొదలు పెట్టారు.ఈ ఘటనతో ‘నక్క’ సామెతలు నిజమని అనుకుంటున్నారు.