టీఆర్ఎస్ ప్రభుత్వం ఓవైపు పోడు భూములకు పట్టాలిస్తామని నమ్మ బలుకుతూ ఇంకోవైపు ఆదివాసీలపై దాడులకు ఉసిగొల్పుతోందన్నారు పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఆదివాసీగూడెం సాకివాగు వలసకు చెందిన గిరిజన మహిళలపై ఫారెస్ట్ గార్డ్ మహేష్ విచక్షణా రహితంగా దాడి చేయడాన్ని ఖండించారు. మహిళలు వంటచెరుకు కోసం అడవిలోకి వెళ్తే కొడతారా? అని మండిపడ్డారు.
అడవిలో నివసిస్తున్న ఆదివాసీలకు కట్టెలు తెచ్చుకొనే హక్కు లేదా? అని ప్రశ్నించారు సంధ్య. ఏ అధికారంతో ఫారెస్ట్ గార్డ్ మహిళలపై విచక్షణా రహితంగా దాడి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టంతో సహా అనేక చట్టాలు అడవిపై ఆదివాసీలకు హక్కులు కల్పించాయని గుర్తు చేశారు. రాజ్యాంగ బద్ధమైన హక్కులు ఎన్నో వారి రక్షణకు ఉన్నాయన్న ఆమె… అవి అమలు చేయవలసిన యంత్రాంగాలే ఉల్లంఘిస్తున్నాయని.. నిరంతరం దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
ఎన్నో ఎన్నికల హామీలిచ్చిన ప్రభుత్వాలు ఆదివాసీలను అడవి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు సంధ్య. అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆదివాసీ, గిరిజనులపై జరుగుతున్న దాడులు అందులో భాగమే స్పష్టం చేశారు. మహిళపట్ల అవమానకరమైన ప్రవర్తన, దాడులు, లైంగిక వేధింపులను నిరోధిస్తూ దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలను పాలకులే తుంగలో తొక్కడాన్ని ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.
ఆదివాసీ మహిళలపై దాడి చేసి, యువతిని వివస్త్రను చేసిన ఫారెస్ట్ గార్డ్ మహేశ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంధ్య. కేసులు నమోదు చేసి అతన్ని ఉద్యోగం నుండి తొలగించాలని.. అడవిపై ఆదివాసీలకు ఉన్న హక్కులను గుర్తించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంధ్య.