అవును. కరోనా బారిన పడ్డ మనం.. ఇకపై మరొకరి బారిన పడనున్నాం. అవే ఆర్ధిక సంస్థలు. కరోనా గొంతులోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్లి మనల్ని చంపేస్తే… ఈ ఆర్ధిక సంస్థలు మన ఇంట్లోకి కూడా చొరబడి మనల్ని పీల్చి పిప్పి చేయనున్నాయి. ప్రపంచంతో పాటు మన దేశం కూడా ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టివేయబడింది. అప్పటికే నానా తంటాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం.. కరోనా దెబ్బకు దేవుడికి దండం పెట్టుకునే పరిస్ధితికి వెళ్లిపోయింది. ఇప్పుడు అందరూ బండి నడపాలంటే.. అప్పులు కావాల్సిందేనని డిసైడ్ అయిపోయారు. అప్పుల కోసం వేట మొదలెట్టారు. మరి అప్పులిచ్చేవాడు ఊరుకుంటాడా.. వాడి కండిషన్లు వాడు పెడతాడు.
ఇప్పుడు రైతులు వాడుకునే ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ పథకం అందులో భాగమే. ఇప్పటివరకు ఎంత కరెంట్ కాలినా అడిగేవారు లేరు. ఇప్పుడు మీటర్లు వస్తాయి.. బిల్లులు వస్తాయి.. బిల్లులు రైతులు కట్టుకోవాలి. ఆ బిల్ అమౌంట్ సర్కార్ వారి అకౌంట్లో వేస్తుంది. బిల్ టైముకి కట్టకపోతే కరెంట్ కట్ చేస్తారు… కాని సర్కార్ టైమ్ కి అమౌంట్ వేయకపోయినా.. ఎవరూ ఏమీ అనలేరు.. అడగలేరు. తర్వాత కరెంట్ బిల్ ఇంత దాటితే… మీకు సబ్సిడీ కట్ అనే రూల్ పెడతారు.. అలా లబ్దిదారుల సంఖ్య తగ్గించేస్తారు.. అలా అలా ఆ బడ్జెట్ తగ్గిపోతుంది. ఆ లెక్క చెప్పే.. అప్పిచ్చేవాడు .. మీ బడ్జెట్ తగ్గితేనేగా మీరు మాకు అప్పు తిరిగి కట్టేది అని గీతోపదేశం చేస్తాడు. ఆ గీతోపదేశం ఫలితమే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం. ఇది ఇక్కడితో ఆగదు.. రేపు నవరత్నాలన్నీ కూడా అలాగే అవుతాయి.. ఆ పథకాలు అలాగే ఉంటాయి.. లబ్దిదారుల సంఖ్య తగ్గిపోతుంది.
వంట గ్యాస్ సబ్సిడీ నగదు బదిలీకి మార్చాక ఏం చేశారో గుర్తుందిగా. ముందు మనకు సబ్సిడీ ధరకే అమ్మేవారు. తర్వాత మీరు మొత్తం కట్టేయండి.. సబ్సిడీ అమౌంట్ మీకు బ్యాంక్ అకౌంట్ లో వేస్తామన్నారు. తర్వాత స్వచ్చంధంగా వదిలేసేవాళ్లు వదిలేయండని సలహా ఇచ్చారు. చాలామంది వదిలేశారు. ఆదార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఐటీ అన్నీ అసైన్ చేస్తున్నారు.. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిందంటే.. ఇక తర్వాత చాలామంది లబ్దిదారుల లిస్టులోంచి లేచిపోతారు. ఇలా నగదు బదిలీ పథకం అంటేనే.. లబ్దిదారుల సంఖ్య తగ్గించడమే. వైసీపీ ప్రభుత్వం ఈ ప్రకటన చేయగానే రైతులు కనుబొమ్మలు ఎగరేశారు. అందరి మదిలోనూ ప్రశ్నలు వచ్చేశాయ్. చర్చలు మొదలయ్యాయ్. అందుకే ఆత్మరక్షణలో పడ్డ ప్రభుత్వం కన్నబాబుతో, అజేయ కల్లాంతో ప్రెస్ మీట్లు పెట్టించి మరీ వివరణ ఇప్పిస్తున్నారు. పైగా ఉచిత విద్యుత్ తెచ్చింది వైఎస్ అని గుర్తు పెట్టుకోవాలని.. తాము రైతులకు అన్యాయం చేసేది లేదంటూ భరోసాలు ఇస్తున్నారు. ఇంత వివరణ ఇస్తూ.. భరోసాలు ఇచ్చారంటే.. ఖచ్చితంగా తేడా ఉందనే కదా.
ఆర్ధిక సంక్షోభం సిగ్నల్స్ ఇప్పుడిప్పుడే కనపడుతున్నాయ్.. ఇక ముందు ముందు మరింత క్లియర్ గా కనపడతాయ్.. పథకాలు అలాగే ఉంటాయ్.. లబ్దిదారులు తగ్గిపోతారు.. సో ప్రజలారా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.. సంక్షోభాన్ని పరిష్కరించలేని పాలకులను సాగనపండానికీ సిద్ధం కండి.