ఉప ఎన్నిక వేళ మంత్రులంతా అక్కడే తిష్టవేసినా..హుజూరాబాద్‌లో జనం సమస్యలు తీరడం లేదు. ఏం కావాలో అడగండి.. ఏదివ్వాలో చెప్పండి అంటూ జనాన్ని ఉదరగొడుతున్న అధికార పార్టీ నేతలు.. అక్కడున్న అసలైన ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. టీఆర్ఎస్‌కు మరోసారి అవకాశమిస్తే.. హుజూరాబాద్‌ను అద్దంలా తీర్చిదిద్దుతామని పోటీపడి ప్రకటనలు చేస్తున్న వారంతా..అదే హుజూరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో వారం రోజులుగా విద్యుత్ లేక రోగులు అష్టకష్టాలు పడుతోంటే.. మాత్రం ఆ వైపు చూసినవారెవరూ లేకుండాపోయారు.
మొన్నటిదాకా అపద్ధర్మ ఆరోగ్య మంత్రి ఏమో అన్నట్టుగా విధులు నిర్వర్తించిన హరీష్ రావు.. నిత్యం అదే ఆస్పత్రి నుంచే అటూ, ఇటూ తిరుగుతున్నారు కానీ.. అందులోని రోగుల ఆర్తనాదాలను మాత్రం పట్టించుకోవడం లేదు. విద్యుత్ లేక ఐసీయూలోని రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఆక్సిజన్ అందక ఉబ్చితబ్బిబవుతున్నారు. ఇక ఫ్యాన్లు తిరకపోవడంతో పసికందులు, బాలింతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లలో నీళ్లు రాక నరకయాతను అనుభవిస్తున్నారు. ఎవరైనా అత్యవసర వైద్యం కోసం వస్తే వెనక్కి తిప్పి పంపుతున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టుగా ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. లేదా కరీంనగర్‌కో లేక వరంగల్‌కో వెళ్లాలని పంపిస్తున్నారు. దీంతో కొనప్రాణాలతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారి పరిస్థితి గాల్లో దీపంలా మారింది.
Advertisements
ఇన్ని దారుణాలు జరుగుతోంటే.. విద్యుత్ సమస్య ఎప్పుడు తీరుతుందని అని అధికారులను అడిగితే తాపీగా రెండు, మూడు రోజులు పట్టొచ్చని చెబుతున్నారు. రూ. 2.5 లక్షల ఖర్చుతో కూడిన ఓ పనిని పూర్తి చేయాలని. కానీ ఉన్నతాధికారుల నుంచి ఆమోదం రాలేదని వారంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా హుజూరాబాద్‌లోనే తిష్టవేసినా, సాక్షాత్తూ ఆర్థిక శాఖ మంత్రే అక్కడే ఉన్నా.. అత్యవసరమైన సేవలు అందించే సర్కార్ ఆస్పత్రి సమస్యలను తీర్చలేకపోతున్నారంటే.. గెలిచి మాత్రం ఏం చేస్తారని రోగులు ప్రశ్నిస్తున్నారు.