మధ్యప్రదేశ్‌లో ఓ పెండ్లింట్ల కరెంట్ పంచాయితీ తెచ్చిపెట్టింది. పెండ్లి ముహూర్త సమయానికి కరెంట్ పోవడంతో పీటలపై ఉన్న వరుడు మారిపోయాడు. చీకట్లో విషయాన్ని గుర్తించని పెద్దలు వివాహాన్ని ఆ వరుడితోనే జరిపించారు. దీంతో పెద్ధ గొడవే జరిగింది.
ఘటన వివరాల్లోకి వెళితే… ఉజ్జయినికి చెందిన రమేశ్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు నిఖిత, కరిష్మా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవలే వాళ్లిద్దరికి పెండ్లి కుదిరింది. వారి ఇద్దరి వివాహాలను ఒకే సమయానికి చేయాలని రమేశ్ నిర్ణయించుకున్నాడు.
వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో వారిద్దరికి పెండ్లిని నిశ్చయించాడు. అనుకున్నట్టుగానే పెండ్లి రోజు రానే వచ్చింది. పెండ్లి ముహూర్తం సమయంలో కరెంట్ పోయింది. అయితే ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదని అందుకే ఈ ముహూర్తానికే పెండ్లి కానిద్దామని పండితుడు చెప్పడంతో చీకట్లోనే పెండ్లి చేశారు.
ఇదే సమయంలో అక్కడ గందరగోళం జరిగింది. దీంతో పీటలపై వరుడు మారిపోయాడు. ఈ విషయం గుర్తించక పోవడంతో అక్కకు కాబోయే భర్తను చెల్లి చేసుకుంది. పెండ్లి కుమారులు ఇద్దరూ ఒకే రకమైన దుస్తులు ధరించడం, ముసుగు ధరించి ఉండటంతో ఎవరూ ఈ విషయాన్ని గుర్తించలేదు. పెండ్లి తంతు ముగిసిన ఇంటికి వెళ్లిన తర్వాత ఆ విషయాన్ని ఆమె చెల్లి గ్రహించింది.
దీంతో పెద్దలను పిలిచి జరిగిన విషయం చెప్పింది. దీంతో కొంత సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక గొడవలతో ఒరిగేదేమీ లేదని అనుకుని మరుసటి రోజు ఇరు జంటలకు ముందు అనుకున్నట్టుగానే వివాహం చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.