పేరు: కొణిదెల కల్యాణ్‌బాబు
ఎత్తు: ఐదడుగుల పది అంగుళాలు
బరువు: సుమారు 60కేజీలు
బలం: ఆవేశం
గుణం: ప్రశ్నించే తత్వం
గమ్యం: అసమానతలు లేని సమాజం
సెప్టెంబర్ 2న 1971 కొణిదెల కుటుంబంలో పుట్టిన కుర్రాడు కల్యాణ్‌బాబు, ఆ బాబే కొన్నేళ్లకి పెరిగి పవన్‌కల్యాణ్ అయ్యాడు. ముక్కుసూటి స్వభావం, ప్రశ్నించే ఉండే కళ్లు, ప్రశాంతంగా వుండి కరుణ కురిపించే నవ్వు… ఇవన్నీ కలిపేసి చూశాక అతను పవర్‌స్టార్ అయిపోయాడు. జనసేనానిగా మారి సముద్రమంత సమూహాన్ని నడిపించే ఆరాధ్యుడయ్యాడు.
ఇండస్ట్రీని ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చిన పవన్‌కల్యాణ్, ఆ తర్వాత అన్న పేరూ వాడలేదు, ఫ్లాపులు వచ్చి కెరీర్ కష్టాల్లో ఉన్నా కాపాడమని మెగాస్టార్‌ని ఆశ్రయించలేదు. స్వయంకృషితో ఎదిగాడు. హిట్లు ఫ్లాపులకి అతీతంగా మారాడు. సినిమా సినిమాకి రేంజ్ పెంచుకుంటూ వెళ్లాడు. ముఖ్యంగా గబ్బర్‌సింగ్‌కి ముందు ఉన్న పవన్‌కల్యాణ్‌కి, ఆ తర్వాత చూసిన పవన్‌కల్యాణ్‌కి చాలా స్ఫష్టమైన తేడా కనిపించింది. అభిమానులకి పవన్ మాటే వేదంగా వినిపించింది. వాళ్లు సినిమాని దాటి నిజమైన పవన్‌కల్యాణ్‌ని చూడడం మొదలుపెట్టారు. ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి తప్పు చేశాడని ఫీల్ అయ్యి అన్నకి దూరంగా వచ్చేశాడు. సొంత ఇంట్లోనే మెగాపవర్ స్టార్‌లు, సుప్రీమ్ హీరోలు, స్టైలిష్ స్టార్‌లు ఉన్నావారందర్నీ దాటొచ్చి సొంత వ్యక్తిత్వం, సొంత ఇమేజ్, సొంత ఫాలోయింగ్ యాడ్ చేసుకున్నాడు. సినిమాల నుంచి రాజకీయాలవైపు వచ్చిన పవన్‌కల్యాణ్, పవర్‌స్టార్ నుంచి జనసేనాని పవన్‌కల్యాణ్‌గా మారాడు. తను ఒక్కమాట చెప్తే లక్షల మంది వింటారు, ఒక్క అడుగు వేస్తే వెనక కోటి మంది నడుస్తారని తెలిసినా కూడా సొంత పార్టీని బలోపేతం చేసుకోకుండా పదేళ్లు గడిపేసిన పవన్‌కల్యాణ్ 2019లో చావు దెబ్బ తిన్నాడు. రూపాయి లంచం ఇవ్వని రాజకీయం, అధికార దాహం లేని నాయకత్వం ఇది పవన్ నైజం. పవన్ పదేళ్లలో ఏమి సాధించాడు అంటే ఒకటి కాదు, రెండు కాదు ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లొంగని 21,30,367 మంది ఓటర్లని సాధించాడు. ఇది భవిష్యత్తుకి పునాది మాత్రమే, ఫ్లాప్ పడిన ప్రతిసారి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చినట్లే పవన్‌కల్యాణ్ 2024 నాటికి జనసేన పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసి బలమైన రాజకీయ పార్టీగా ఎదిగేలా చేసే సత్తా గల సాహసి, సత్యాన్వేషి. పరిస్థితులు తనకి అనుకూలంగా ఉంటే పవన్‌కల్యాణ్ 2024లో సీఎం అవుతాడు, అవే పరిస్థితులు తలకిందులైతే గెలిచిన సీఎంకి మొగుడవుతాడు. ఇది ప్రతి పవన్ అభిమాని చెప్పే మాట, మరి పవన్ ఈ మాటని నిజం చేస్తాడా? లేక మరోసారి నిరాశ పరుస్తాడా? 2024లో అధికారంలోకి రాగలడా అంటే ఆ ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి. ఫలితం గురించి ఆలోచన వదిలేసి, అప్పుడప్పుడూ కాకుండా అనునిత్యం ప్రజల్లోనే ఉంటే, ప్రజల కోసం పోరాడితే, ప్రజల తరపున ప్రశ్నిస్తే ఈ అయిదేళ్ల సంధి కాలంలో పవన్‌కల్యాణ్ నాయకుడిగా ఎంతో ఎదగగలడు… అన్నీ కలిసొస్తే వచ్చేసారి సీఎం కాగలడు.