పవన్‌కల్యాణ్.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ రోజు తన 48వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ జనసేనాని సినీ కెరియర్ వయసు 23 సంవత్సరాలు. సినిమా ఒక్కటే తన లోకం అనుకునే హీరోలయితే ఇంతటి సుదీర్ఘమైన కాలంలో కనీసం 50 మార్కు దాటిపోయి ఉండేవారు. కానీ పవన్‌కల్యాణ్ 23 ఏళ్ళలో చేసింది కేవలం 25 సినిమాలే. నమ్మడానికి కాసింత కష్టమయినా ఇది నిజం. ఈ 25 సినిమాల్లో కూడా ఎక్కువ శాతం పరాజయాలే. అయినా సరే పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. లక్షలాది అభిమానుల గుండెల్లో చెరగని స్థానంతో వారికి పవర్‌స్టార్‌గా మారిపోయాడు.
పవన్‌కల్యాణ్ అంటే పుస్తకాలే గుర్తొస్తాయి అందరికీ. తనకు పుస్తక పఠనంపై ఎంత ఆసక్తి ఉందో తెలిసిందే. చిన్నతనంలో తనకు చదువంటే అస్సలు పడేది కాదట. ఏ స్కూల్లో కూడా ఎక్కువరోజులు చదవలేకపోవడంతో, ఏకంగా అరడజనుకు పైనే స్కూల్స్ మారాడు పవన్. విషయం ఏదైనా సరే, స్టేజ్ పైన మైకు చేతబట్టి అనర్గళంగా మాట్లాడే పవన్‌కల్యాణ్ చిన్నతనంలో చాలా బెరుగ్గా, నలుగురిలో మాట్లాడే విషయంలో సిగ్గరిగా ఉండేవాడట. చదువు విషయంలో రాణించలేకపోయి, ఇంటర్ ఫెయిల్ అయినపుడు, తన అన్నయ్య చిరంజీవి ఏదైనా కంప్యూటర్ కోర్స్ అయినా చేస్తే మచిదని సలహా ఇచ్చినా అందులో కూడా పవన్ రాణించలేకపోయాడట.
ఆ సందర్భంలో జీవితంలో ఏంచేస్తే బాగుంటుందా అని విపరీతమైన బెంగతో ఉన్న పవన్‌కల్యాణ్‌ను చూసి చిరంజీవి సతీమణి సురేఖ, తన భర్తతో ఎలాగైనా సరే పవన్‌కల్యాణ్‌ని నటుడిగా మార్చే ప్రయత్నం చెయ్యమని చెప్పారట.
కేవలం చెప్పి వదిలెయ్యకుండా ఈ విషయమై చిరుపై ఎంతో ఒత్తిడి చేశారట సురేఖ. ఆ తర్వాత వైజాగ్‌లో సత్యానంద్ మాస్టర్ దగ్గర యాక్టింగ్ కోర్స్ జాయినవ్వడం, పవన్‌కల్యాణ్ “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” చిత్రంతో తెరంగేట్రం చెయ్యడం జరిగిపోయింది. ఆ తర్వాత హీరోగా పవన్‌కల్యాణ్ ఎలా ఎదిగిపోయాడో, కోట్లాది అభిమానుల గుండెల్లో పవర్‌స్టార్‌గా ఎలా చెరగని ముద్ర వేసుకున్నాడో మనకి తెలుసు. ఈ విధంగా పవన్‌కల్యాణ్ ఇంతమంది గుండెల్లో నిలిచిపోయేలా చేసిన వ్యక్తి మాత్రం పవన్ వదినగారే.