న్యూఢిల్లీ: జాతీయ ప్రాజెక్టు ‘పోలవరం’పై ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ప్రాజెక్టు ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైందని, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తేటట్టుగా ఉందని పీపీఏ ఆందోళన వ్యక్తంచేసింది. 12 పేజీల నివేదికను పీపీఏ కేంద్రానికి సమర్పించింది. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల జరిగే నష్టాలను నివేదికలో వివరంగా పొందుపరిచింది. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో మరింత జాప్యం జరిగే ప్రమాదం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. జాప్యం కొనసాగితే పోలవరం ప్రయోజనాలు కూడా ఆలస్యమవుతాయని నివేదికలో పీపీఏ స్పష్టంచేసింది. దీనివల్ల పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులు భారం అవుతాయని అభిప్రాయపడింది. తక్కువ ధరకు కాంట్రాక్టర్ వస్తారన్న నమ్మకం కూడా లేదని.. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం అధికంగా ఉంటుందని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించడమే మంచిదని అథారిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. కేంద్రానికి పంపిన ఈ నివేదికను పీపీఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపింది.