పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ప్రభాస్ నుంచి వచ్చే 7 నెలల్లో మూడు సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే ‘ఆదిపురుష్’, ‘సలార్’ మేకర్స్ విడుదల తేదీలను ప్రకటించగా.. తాజాగా మరో ‘కే’ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ను మూవీ యూనిట్ తెలిపింది. మహా శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ 2024 జనవరి 12న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.
మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించనుంది. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇక ఈ ప్రాజెక్టులో సుదీర్ఘమైన 5 యాక్షన్ బ్లాకులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని తెరకెక్కించేందుకు నలుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను సిద్ధంగా ఉంచారని వార్తలు కూడా వచ్చాయి.
ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్ సినిమా సంక్రాతి పండుగకు రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కాగా డార్లింగ్ నటిస్తున్న మరో చిత్రం సలార్ చిత్రం సెప్టెంబర్ 23వ తేదీన విడుదల కానుందని ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, మారుతి డైరెక్షన్ లో ‘రాజా డీలక్స్’ సినిమాలు కూడా ప్రభాస్ చేయనున్నారు.