హీరోలు సినిమాలకు కమిట్ అయినప్పుడు అడ్వాన్స్ అందుకోవడం సహజం. అలా అందుకునే అడ్వాన్స్ ఎమౌంట్.. పారితోషికంలో ఏ 10శాతమో, 25శాతమో ఉంటుంది. కానీ టాలీవుడ్ లో ప్రభాస్ అందుకునే అడ్వాన్సులు ఈ రేంజ్ లో ఉండవు. కళ్లుచెదిరేలా ఉంటాయి. ఇప్పటికే ఓసారి అలాంటి కళ్లుచెదిరే అడ్వాన్స్ అందుకున్న ప్రభాస్, ఇప్పుడు మరోసారి అలాంటి మొత్తమే అందుకున్నాడు.
డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు ప్రభాస్. ప్రాజెక్టుకు ఇంకా డైరక్టర్, కథ సెట్ అవ్వలేదు. కేవలం కమిట్ మెంట్ మాత్రమే అయింది. ఈ సందర్భంగా అడ్వాన్స్ పేమెంట్ కింద ఏకంగా 50 కోట్ల రూపాయలు అందుకున్నాడట ప్రభాస్. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు ప్రభాస్. అంటే.. అడ్వాన్స్ కింద ఏకంగా 50శాతం మొత్తాన్ని అందుకున్నాడన్నమాట.
అటు దానయ్య కూడా తక్కువోడేం కాదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో కళ్లుచెదిరే బిజినెస్ చేశాడు. అదిరిపోయే లాభాలు అందుకున్నాడు. అలా వచ్చిన డబ్బును ఇలా అడ్వాన్స్ ల రూపంలో స్టార్ హీరోలకు అందిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ 50 కోట్లు అందుకున్నాడు. త్వరలోనే మరో ఇద్దరు స్టార్ హీరోలు ఈ స్థాయిలో కాకపోయినా, తమ స్థాయిల్లో భారీ అడ్వాన్స్ అందుకోబోతున్నారు.
ఇక ప్రభాస్ విషయానికొస్తే, అడ్వాన్స్ రూపంలో ఇంత మొత్తం అందుకోవడం ప్రభాస్ కు ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ఆదిపురుష్ సినిమా కోసం టి-సిరీస్ సంస్థ ఇలా ఒకేసారి పెద్ద మొత్తం అందించింది. దాని విలువ అటుఇటుగా 60 కోట్ల రూపాయలు అని టాక్. మిగతా సినిమాల కంటే ముందుగా ఆదిపురుష్ ను పూర్తిచేసేందుకు, ఎక్కువ కాల్షీట్లు కేటాయించేందుకు ఇలా రెండు దఫాల్లో రెమ్యూనరేషన్ మొత్తం అందించింది టి-సిరీస్ సంస్థ. ఆ అడ్వాన్స్ తర్వాత ప్రభాస్ అందుకున్న పెద్ద చెక్ దానయ్యదే.