జాన్ మరో సాహసం ? - Tolivelugu

జాన్ మరో సాహసం ?

ప్రభాస్ మళ్ళీ సాహసమే చేస్తున్నాడా?

ఇప్పుడు తను చేయబోయే ‘జాన్’ సినిమా థీమ్ చూస్తే అలానే అనిసిస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందు బాహుబలి కోసం ఐదేళ్ళు కేటాయించి చాలా పెద్ద సాహసం చేశాడు. వెంటనే మళ్ళీ కేవలం రెండవ సినిమా డైరెక్ట్ చేస్తున్న సుజీత్‌తో 350 కోట్ల బడ్జెట్ వెచ్చించి చేసిన సాహో కోసం మరో రెండేళ్ళు కేటాయించి మరో సాహసం చేశాడు. ఆ సినిమా ఫలితం తారుమారై, పెద్ద డిజాస్టర్‌గా మారి కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ తన తదుపరి మూవీలో కూడా ప్రభాస్ మరో సాహసం చేస్తున్నాడని తెలుస్తోంది.
తన పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు నిర్మాతగా ప్రభాస్ నెక్స్ట్ ఫిల్మ్ ‘జాన్’ రాబోతున్న విషయం తెలిసిందే. గోపీచంద్ హీరోగా వచ్చిన జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ చెప్పిన కథ నచ్చి, ఈ ప్రాజెక్టును ప్రభాస్ చాలా రోజుల ముందే మొదలెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే కొద్ది భాగం పూర్తి చేశారు. అది కూడా దాదాపు రెండేళ్ళ ముందు. మరి అది అలాగే ఉంచేస్తారా, లేక మళ్ళీ రీషూట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
అయితే ఇప్పుడు జాన్ సినిమా గురించి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ బయటికి వచ్చి ప్రభాస్ అభిమానులతో పాటుగా, సినీ అభిమానులందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి. జాన్ సినిమా మొత్తం 1960ల కాలంలో జరిగే ఒక పీరియాడిక్ డ్రామా. అలాగే ఈ సినిమా మొత్తం మీద కేవలం ఆరే ముఖ్య పాత్రలు ఉంటాయని, సినిమా మొత్తం ఆ ఆరు పాత్రల చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. జాన్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నగరంలో యూరోప్‌ను పోలి ఉండే పాతిక సెట్స్ వేయడం అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. జాన్ మూవీలో ప్రభాస్‌కు జతగా పూజా హెగ్డే నటిస్తోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp