విధికి, ప్రేమకు మధ్య జరిగే యుద్ధమే రాధేశ్యామ్. ఈ విషయాన్ని మేకర్స్ ఎప్పుడో బయటపెట్టారు. పోస్టర్లలో కూడా అదే కనిపిస్తోంది. మరి ఈ సినిమాలో విధి గెలుస్తుందా? విధిని ఎదిరించిన ప్రేమ గెలుస్తుందా? ఇదే ప్రశ్న ప్రభాస్ కు ఎదురైంది. దీనిపై ప్రభాస్ చాలా తెలివిగా స్పందించాడు. రాధేశ్యామ్ సినిమా కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, ఈ ప్రశ్నకు తను సమాధానం చెబితే.. ఆ 3వందల కోట్ల రూపాయలు వృధా అవుతాయని అంటున్నాడు ప్రభాస్.
సినిమాలో చేయి చూసి జాతకాలు చెప్పే విక్రమాదిత్య పాత్రలో కనిపించాడు ప్రభాస్. వ్యక్తుల విధి రాత ఎలా ఉందో ఇట్టే చెప్పేస్తాడు. తన చేయి కూడా చూసుకుంటాడు, తనకు ప్రేమ కలిసిరాదనే విషయం తెలుసుకుంటాడు. అందుకే అందరితో సరదాగా ఉంటాడు, లేదంటే డేటింగ్ మాత్రమే చేస్తుంటాడు. కానీ ప్రేరణ (పూజా హెగ్డే) విషయంలో మాత్రం ప్రభాస్ గాడి తప్పుతాడు.
తనకు తెలియకుండానే ప్రేమలో పడతాడు. ప్రేమిస్తే చనిపోతాడని తెలుసు, అలా అని ప్రేమను వదులుకోలేడు. అందుకే విధిని ఎదిరిస్తాడు? జరగబోయేది తెలిసి కూడా తెగిస్తాడు. మరి అంతిమంగా విక్రమాదిత్య ఏం సాధించాడనేది సినిమా.
Advertisements
ఈ సినిమా క్లైమాక్స్ పై చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి. వీటిపై యూనిట్ స్పందించడం లేదు. జాతకాల్ని కొట్టి పారేయడం లేదని ఓ మంచి ముగింపు మాత్రం ఇచ్చామని చెబుతోంది. మరికొందరు మాత్రం సినిమాటిక్ క్లైమాక్స్ ఊహిస్తున్నారు. విధిని ఎదిరించి ప్రేమ గెలిచి ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి కీలకమైన ప్రశ్నకు రిలీజ్ కు ముందే ప్రభాస్ ఎందుకు సమాధానం చెబుతాడు? అందుకే తెలివిగా తప్పించుకున్నాడు.