సినిమా ఫ్లాప్ అయితే ఒకప్పట్లా కవర్ చేసుకోవడం లేదు హీరోలు. తమ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకుంటున్నారు. మొన్నటికిమొన్న గని సినిమా డిజాస్టర్ అయితే బహిరంగంగా లేఖ విడుదల చేశాడు వరుణ్ తేజ్. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే దారిలో నడిచాడు. రీసెంట్ గా అతడు నటించిన రాధేశ్యామ్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా ఆడలేదు.
దీనిపై స్పందించిన ప్రభాస్… రాధేశ్యామ్ ఫ్లాప్ అయిందని అంగీకరించాడు. ఆ సినిమా విషయంలో తప్పు చేశానని ఒప్పుకున్నాడు. రాధేశ్యామ్ లో బలమైన స్క్రిప్ట్ లేదని తెలిపిన ప్రభాస్, ఆ సినిమా పరాజయాన్ని తన మిస్టేక్ గా చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో అతడు ఎవ్వర్నీ నిందించలేదు, తప్పుబట్టలేదు.
డిఫరెంట్ జానర్స్ లో కొత్త కథలు చేయడం తనకు ఇష్టమని గతంలోనే ప్రకటించాడు ప్రభాస్. చెప్పినట్టుగానే బాహుబలి తర్వాత డిఫరెంట్ కథలు సెలక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే జాతకాల నేపథ్యంలో సాగే ప్రేమకథను ఎంపిక చేసుకున్నాడు. కాన్సెప్ట్ అయితే బాగుంది కానీ, స్క్రిప్ట్ లెవెల్లో అది తేడా కొట్టిందనే విషయాన్ని ప్రభాస్ బయటపెట్టాడు.
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నప్పటికీ.. ప్రభాస్ నుంచి ఆడియన్స్ ఆశించే అంశాలేవీ ఇందులో లేవు. కనీసం ఫ్యాన్స్ ను తృప్తిపరిచే మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్ లాంటివి కూడా పెట్టలేదు. ప్రభాస్ ఇమేజ్ కు భిన్నంగా ఉండడంతో ఈ సినిమా ఫెయిల్ అయింది.