కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ చూసిన వాళ్లంతా ఇదొక విజువల్ వండర్ అవుతుందని నిర్ణయానికి వచ్చేశారు. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయో లేదో నిముషాల్లో సేల్ అయిపోయాయి. ప్రభాస్ అభిమానులు మొత్తం సాహో ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ప్రభాస్ మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత చేస్తున్న తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు టికెట్ ధర ఎంతైనా లెక్క.చేయకుండా ఫ్యాన్స్ ఎగబడ్డారు.
ఆన్‌లైన్ అడ్వాన్స్ బుకింగ్ వెబ్‌సైట్స్‌లో మొదటిరోజు సాహో టికెట్స్ మొత్తం అమ్ముడయ్యాయి. ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ సంస్థ పేటీయంలో సాహో చిత్రం ఓ సంచలనం నమోదు చేసింది. పేటీయంలో ఏకంగా 10 లక్షల సాహో చిత్ర టికెట్లు అమ్ముడయ్యాయి, అంటే మిలియన్ మార్కు నమోదు చేసింది. ఆ సంస్థ అమ్మకాల్లో ఇదొక రికార్డుగా చెబుతున్నారు. సాహో చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉండేవో దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది.
ఇంతవరకూ బానే ఉంది. కానీ.. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ తప్ప మిగిలిన ప్రేక్షకుల నుంచి బిలో యావరేజ్.. అట్టర్ ఫ్లాప్ అనే టాక్ వినిపిస్తోంది. సాహో సినిమాకు అనవసరమైన హైప్ సృష్టిస్తూ వచ్చారు కానీ.. ఈ సినిమా ఒక పెద్ద డిజాస్టర్ అని సినీ విశ్లేషకులు పేర్కొనడం నిజంగా ప్రభాస్‌కు ఒక పెద్ద దెబ్బలా కనిపిస్తోంది. ఎవరో చెప్పడం ఒక ఎత్తు, కానీ ఏకంగా ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ అయిన తరణ్ ఆదర్శ్.. సాహో సినిమా “అన్ బేరబుల్” అని చెప్పడం.. అంటే భరించలేని సినిమా అని కామెంట్ చేయడం, మరీ అర స్టార్ రేటింగ్ ఇవ్వడం చూస్తే, 350 కోట్ల బడ్జెట్ బురదలో పోసిన పన్నీరేనా అనిపిస్తోంది. ఒక విధంగా నిర్మాతల వరకూ సేఫే అయినా మరి పాపం డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి ఏమవుతుందో చూడాలి..!