బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు ప్రభాస్. మూవీ హిట్టవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనే అంశాలతో సంబంధం లేకుండా.. కథ, నటీనటులు, టెక్నీషియన్స్, బడ్జెట్ ను పాన్ ఇండియా లెవెల్లో సెట్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా ప్రభాస్ లైనప్ లో వినిపించిన దర్శకుడి పేరు సిద్దార్థ్ ఆనంద్.
ఈ బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ సినిమా చేస్తాడంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే, ఆదిపురుష్ స్థానంలో సిద్దార్థ్ ఆనంద్ ప్రాజెక్టునే ప్రభాస్ సైన్ చేయాల్సి ఉంది. కానీ.. అప్పట్లో అవి వదంతులుగానే మిగిలిపోయాయి. ఇప్పుడా ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చింది. త్వరలోనే సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు ప్రభాస్.
బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి యాక్షన్ సినిమాలతో పాపులర్ అయ్యాడు సిద్దార్థ్ ఆనంద్. ఇప్పుడీ దర్శకుడు పఠాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఫైటర్ అనే సినిమా కూడా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ తో సినిమా చేస్తాడు.
ఇటు ప్రభాస్ కూడా సలార్, ప్రాజెక్ట్-కె సినిమాలతో బిజీగా ఉన్నాడు. స్పిరిట్ అనే సినిమా కూడా చేయబోతున్నాడు. ఈ కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత సిద్దార్థ్ ఆనంద్ తో యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. టీ-సిరీస్ సంస్థ ఈ ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేయబోతోంది.