విజయదశమి సందర్బంగా ప్రముఖ నటుడు ప్రభాస్ రావణ దహనం చేయనున్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పలు దేశాల రాయబారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఈ విషయాన్ని లవ్ కుష్ రామ్‌లీలా కమిటీ ప్రెసిడెంట్ వెల్లడించారు. టీజర్ కార్యక్రమాన్ని ముగించుకున్న ప్రభాస్ ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. విజయ దశమి సందర్భంగా ఆయన బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లేదా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం రామ్‌లీలలో నిర్వహించే రావణ దహన కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొంటారు.
రావణ దహనంలో ప్రభాస్ పాల్గొంటుడంతో కార్యక్రమానికి భారీగా జనం వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు ఐదు లక్షలకు పైగా పాసులను పంపిణీ చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి అదనంగా మరో రెండు లక్షల పాస్‌లను ముద్రిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు. గత రెండేండ్లుగా కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున నవరాత్రి ఉత్సవాలు జరగలేదు.
ఈ క్రమంలో ఈ సారి ప్రజలు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. నాలుగు రోజులుగా రోజుకు సుమారు 50 వేల మందికి పైగానే వస్తున్నట్టు లవ్కుష్ రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు తెలిపారు. కార్యక్రమానికి ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.