రెబల్‌స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్‌ను అసలు సిసలైన హీరోగా మార్చింది దర్శక ధీరుడు రాజమౌళియే. అందులో అనుమానమే లేదు. బాహుబలి, అంతకు ముందు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఛత్రపతి సినిమాల ద్వారానే ప్రభాస్ ఒక రేంజ్ హీరోగా ఎదిగిపోయాడు. ఛత్రపతి సినిమా తర్వాతే ప్రభాస్ మార్కెట్ పెరుగుతూ వచ్చింది. ఇక బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఇండియా దాటేసింది. తర్వాత తను ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయాడు.
పెద్ద క్రేజ్, అంతకంటే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే ప్రస్తుతం వినిపించే ఓకే ఒక్క పేరు ప్రభాస్. తమ డార్లింగ్ హీరోని ఎంత ప్రేమిస్తారో ప్రేక్షకులు అంత తిట్టుకుంటారు కూడా. ఎందుకంటే తమకు అత్యంత ఇష్టమైన హీరో రెండేళ్లకు ఒకసారి సినిమా చేస్తుండటమే రీజన్. ప్రతి ఏడాదీ కనీసం రెండు సినిమాలైనా చేస్తే బాగుంటుందని ఫాన్స్ అందరూ కోరుకుంటూ ఉంటారు. ఈ విషయంలో తన అభిమానుల్ని ప్రభాస్ నిరుత్సాహ పరుస్తూనే ఉన్నాడు. బాహుబలి సినిమా కోసం ఏకంగా ఐదు సంవత్సరాలు కేటాయించాడు. బాహుబలి విడుదలకు ముందు ప్రభాస్ అసలు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉండిపోయాడు.
మొత్తానికి ఆ సినిమా అయిపోయి, విడుదలై.. సూపర్ సక్సెస్ సాధించాక అతని క్రేజ్ ఊహించని రేంజ్‌లో పెరిగిపోయింది. ఇక మా ప్రభాస్ వరుస సినిమాల్లో కనిపిస్తాడనుకుంటే మళ్ళీ హోం ప్రొడక్షన్ హౌస్‌లో ‘సాహో’ సినిమాకు రెండేళ్ళు కేటాయించాడు. మొత్తం మీద బాహుబలి అండ్ సాహో మూవీలకే ప్రభాస్ తన కెరియర్‌లో ఏడేళ్ళు వెచ్చించాడు. సాహో ప్రచార కార్యక్రమాల్లో ప్రభాస్ ఇకపై అంత భారీ సినిమాలకు కాస్త దూరంగా ఉంటానని, చెప్పకుండానే రెండు సినిమాలు చేసి చూపిస్తాననిన బహిరంగంగా అనౌన్స్ చేశాడు.
మరిప్పుడు సాహో అయిపోయింది కాబట్టి తర్వాత ఏంటనే చర్చ మొదలయింది. సాహో షూట్ సమయంలోనే గోపీచంద్ హీరోగా వచ్చిన ‘జిల్’ సినిమా దర్శకుడు రాధాకృష్ణ చెప్పిన ఓ ప్రేమకథకు ప్రభాస్ ఓకే చెప్పాడు. ఆ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యింది. ఓ ఇరవై రోజుల పాటు షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. అందులో పూజా హెగ్డే హీరోయిన్. అన్నట్టు ఆ సినిమా నిర్మాత ఎవరో తెలుసా? ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు. ఇప్పుడిక ప్రభాస్ ఆ సినిమా మళ్లీ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు.