ఇదేదో ప్రభుదేవాకు మాఫియా ఇచ్చిన వార్నింగ్ కాదు. స్వయంగా అతడు చెప్పిన మేటర్. త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు ఈ నటుడు కమ్ డైరక్టర్. ఆ మూవీలో ప్రభుదేవాకు డైలాగ్స్ ఉండవు, డాన్స్ ఉండదు, చివరికి ఎక్స్ ప్రెషన్ కూడా ఉండదు. ఎందుకంటే, అందులో శవంగా కనిపించబోతున్నాడు ప్రభుదేవా.
అవును.. త్వరలోనే ఓ తమిళ సినిమా చేయబోతున్నాడు ప్రభుదేవా. అందులో ఆయన శవంగా కనిపించబోతున్నాడు. ఏదో ఒక సీన్ లోనో లేక ఒక ఎపిసోడ్ లోనో కాదు, పూర్తిస్థాయి శవం పాత్ర అది. సినిమా మొత్తం శవం కనిపిస్తుంది. ఆ శవం ఎలా చనిపోయిందనేది కథ.
ఇలా ప్రయోగాలు చేయడం తనకు ఇష్టం అంటున్నాడు ప్రభుదేవా. శవం సినిమాతో పాటు మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా మొత్తం ఒంటికాలితో కనిపించబోతున్నాడు ఈ నటుడు. అంతెందుకు, ప్రస్తుతం విడుదలకు సిద్ధమైన ఓ సినిమాలో కూడా ప్రభుదేవాది ప్రయోగాత్మకమైన పాత్రే.
మై డియర్ భూతం అనే సినిమా చేశాడు ప్రభుదేవా. ఇందులో అతడు భూతంగా కనిపించాడు. భూతం ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది లాంటివి తనకు తెలియవని, ఏవేవో పుస్తకాలు చదివి అలా నటించానని చెప్పుకొచ్చాడు. ఈ పాత్ర కోసం అతడు పూర్తిగా గుండుకొట్టించుకున్నాడు. ఇలా ప్రయోగాలు చేస్తూ, సినిమాలు చేస్తున్నాడు ఈ నటుడు.