మంత్రి మల్లారెడ్డి ఇలాఖ మేడ్చల్ జిల్లా కబ్జాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. సాధారణంగా ఇప్పటి వరకు ఖాళీ స్థలాలు, కాంపౌండ్ లేని ప్లాట్లపైనే అక్రమార్కులు కన్నేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా పబ్లిక్ పార్క్ ప్లేస్‌నే మింగేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ప్రగతినగర్ B బ్లాక్ లోని 1800 గజాల పార్కు స్థలాన్ని పట్టపగలే కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు వ్యక్తులు. ఇళ్లల్లో మగవారు లేని సమయాన్ని చూసి, అక్కడ ఉన్న ఆడవారిని బెదిరించి, భయబ్రాంతులకు గురిచేసి తమ కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించినందుకు కబ్జాదారులు దాడులకు తెగబడుతున్నారు.
ఇప్పటికే వారి ఆగడాలపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ప్రగతి నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి దృష్టికి కూడా తమ సమస్యను తీసుకెళ్లామని, కానీ ఆయన కూడా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవాలని కోరుతున్నారు.