భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఆయన ప్రపంచ నెంబర్ 1 చెస్ క్రీడాకారుడు కార్ల్ సన్ ను ఓడించారు. తాజాగా మరో రెండు రౌండ్లలో ప్రజ్ఞానంద విజయాలను అందుకున్నాడు.
ఈ యువ ఆటగాడు రష్యన్ ప్లేయర్ నాడిర్ బెక్ అబ్దుసట్టారావ్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ ను డ్రాగా ముగించాడు. ఆ తర్వాత అండ్రీ ఎసిపెంకో, అలెగ్జాండ్రా కోస్టిన్యూక్‌లను 10,12 వ రౌండ్లలో ఓడించాడు.
అయితే 11వ రౌండ్‌లో మాత్రం జీఎం లాన్ నెమోనియాచి చేతిలో పరాజయాన్ని పొందాడు. ఫలితంగా ఈ యువ ప్లేయర్ ప్రస్తుతం 15 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నారు.
ఇక మంగళవారం రాత్రి మరో ముగ్గురు ఆటగాళ్లతో ప్రజ్ఞానంద్ పోటీపడనున్నారు. మొదటగా 13వ రౌండ్‌లో జర్మనీ ఆటగాడు విన్‌సెట్ కీమర్‌తో, 14వ రౌండ్‌లో అమెరికా ప్లేయర్ హాన్స్ మోకె నీమన్‌తో తలపడతాడు. చివరగా రష్యన్ ప్లేయర్ వ్లాదిస్లేవ్ ఆర్తెమీవ్‌తో 15వ రౌండ్‌లో ఆడతారు.
స్టాలిన్ అభినందనలు…
ప్రజ్ఞానందకు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ 16 ఏండ్ల గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్ కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నాము ” అని ట్వీట్ లో పేర్కొన్నారు.