గుండెపోటుతో నడిరోడ్డుపై పడిపోయిన బాలరాజు అనే వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కానిస్టేబుల్ సమయస్ఫూర్తి పై పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందనలు తెలియజేశారు.
సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.. రాజశేఖర్ ను అభినందించారు. అతడిని నగదు బహుమతితో సత్కరించారు. బస్సు కోసం వెయిట్ చేస్తున్న బాలరాజు అకస్మాత్తుగా గుండెపోటుకు గురికాగా… అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడాడు.
ఈ ఘటన నిన్న ఆరాంఘర్ చౌరస్తాలో జరిగింది. బాధితుడు 2 నిమిషాల అనంతరం స్పృహలోకి వచ్చాక 108 లో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ ను మంత్రి హరీశ్ రావు సైతం అభినందించారు.
ట్రాఫిక్ పోలీసులు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు సీపీఆర్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ట్రైనింగ్ ను వారం రోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ లో వెల్లడించారు.