తెలంగాణలో హాట్ టాపిక్ ఏటంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నికే. ప్రజలందరూ ఎప్పుడు ఎలక్షన్ ఉంటుందా అని అటువైపే చూస్తున్నారు. ఏ పార్టీ ఏం చెబుతోంది. ఏం చేస్తోందో అన్ని విషయాలను గమనిస్తున్నారు. నిన్నటిదాకా సిద్దిపేటలో ఉండి చక్రం తిప్పిన హరీష్ రావు.. ఎట్టకేలకు హుజూరాబాద్ లో ముఖం చూపించి ప్రచారం మొదలుపెట్టారు. ఈటల కూడా తన పాదయాత్రను కొనసాగించేందుకు సిద్ధమౌతున్నారు. కేసీఆర్ దళిత బంధు ప్రారంభోత్సవ కార్యక్రమం పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఇదంతా రొటీనే. కాకపోతే హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా ఖరీదు ఎందుకయ్యింది..? ఒక్క ఎన్నిక కోసం కేసీఆర్ అంత పెద్దఎత్తున నిధులు విడుదల ఎందుకు చేస్తున్నారు..? హుజూరాబాద్ కోసమే దళిత బంధు పథకాన్ని ఎందుకు పెట్టారు..? ఇప్పుడే గొర్రెల పంపిణీని.. అదికూడా ఇక్కడే ఎందుకు పంచుతున్నారు..? మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు.. మున్సిపాలిటీలకు నిధులు… అంతేనా.. అనధికారిక లెక్కల ప్రకారం అదనంగా రూ.130 కోట్ల ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం ఇతర పార్టీల నాయకులను టీఆర్ఎస్ లోకి చేర్చుకోడానికే ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు ఖర్చు చేయాల్సి వచ్చింది..? సర్వేల ప్రకారం ఈటల ముందున్నారని తెలిసే కేసీఆర్ ఇంత పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారా..?
పార్టీ పరంగా డబ్బు ఖర్చు అలా ఉంటే ప్రభుత్వ పరంగా దళిత బంధుతో కలిపి సుమారు రూ.2 వేల కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. ఈ హడావిడి చూస్తుంటే ఒక్క హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేసీఆర్ ఇంతగా శ్రమిస్తుంటే.. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎంత కష్టపడాల్సి వస్తుందోననే భయం టీఆర్ఎస్ నాయకుల్లో కనపడుతోందని అంటోంది ప్రజా జాగృతి వేదిక. మండలానికో ఇంచార్జ్ తో పాటు సగం కేబినెట్ హుజూరాబాద్ లోనే మకాం వేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందని చెబుతోంది. కేసీఆర్ కూడా పాలన పక్కన పెట్టి కేవలం హుజూరాబాద్ పైనే పని చేస్తున్నారని.. దీన్నిబట్టి ఆయన ఏటికి ఎదురు ఈదుతున్నారని తెలుస్తోందని అంటోంది.
ఇక ప్రచారం విషయానికి వస్తే.. ఈటల ఆత్మగౌరవ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అటు కన్నతల్లి లాంటి పార్టీని ఈటల మోసం చేశారని టీఆర్ఎస్ చెబుతోంది. పైగా దళితుల భూములు గుంజుకున్నారని.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని.. ఆయనొక్కడే డెవలప్ అయ్యారని అంటోంది. దీనిపై ఈటల స్పందిస్తూ… తన ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమని హరీష్, కేసీఆర్ లు కూడా తమ ఆస్తులపై విచారణ కోరాలని డిమాండ్ చేశారు. అయితే ఈటల సవాల్ ను కేసీఆర్ స్వీకరించి అక్రమాలను నిరూపించగలిగితే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఈజీ అయ్యే అవకాశం ఉంది. అదే.. స్వీకరించకపోతే ఈటల దాన్నే తన ప్రచార అస్త్రంగా వాడుకునే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే కేసీఆర్ మొదటి నుండి చెబుతోంది ఈటల దళితుల భూములు గుంజుకున్నారు.. అక్రమంగా కోట్లు సంపాదించారని. అలాంటప్పుడు ఆయన సవాల్ ను స్వీకరించవచ్చుగా అనే ప్రశ్న వినిపిస్తోంది.
టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు హరీష్ రావు, కేసీఆర్ ఆస్తుల విలువ ఎంత..? ఈటల ఆస్తుల విలువ ఎంత..? అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పెరిగిన ఆస్తుల విలువ ఎంత..? అనే దానిపై ఎవరికి వారే.. ఎవరి ప్రమేయం లేకుండా నిజాయితీగా సుమోటోగా సీబీఐ గానీ.. న్యాయ విచారణకు గానీ కోరుతూ లేఖలు రాస్తే అప్పుడు ప్రజలు నమ్మే అవకాశం ఉందని అంటోంది ప్రజా జాగృతి వేదిక. ఇప్పటికే ఈటల సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. హరీష్, కేసీఆర్ కూడా ముందుకు వచ్చి స్వాగతించాలని సూచిస్తోంది. అలా కాకుండా కేవలం ఎన్నికల ప్రచార అస్త్రంగా ఆస్తుల అక్రమ పెరుగుదల గురించి మాట్లాడితే ప్రజలు నమ్మరని అంటోంది. ఎన్నికల్లో పెద్దఎత్తున ఖర్చు చేసేందుకు టీఆర్ఎస్ కు డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో కూడా సీబీఐతో విచారణ చేయిస్తే బాగుటుందని చెబుతోంది. అంతకుముందు ఎన్నికల్లో చేసిన ఖర్చు పక్కన పెడితే.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటర్లకు డబ్బులు పంచారని ఆరోపిస్తోంది. రెండు ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే స్థానంలో సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేశారని అంటోంది ప్రజా జాగృతి వేదిక. ఇంత పెద్దఎత్తున డబ్బును కేసీఆర్ ఎక్కడ నుండి సమకూర్చుకున్నారో తెలియాలని… అది సీబీఐ విచారణ ద్వారానే తెలుస్తుందని అంటోంది. అందుకే కేసీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తోంది ప్రజా జాగృతి వేదిక.