ప్రజా జాగృతి వేదిక
హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు సంచులతో, అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ప్రణాళికను సిద్ధం చేశారు. డబ్బుతో ఓటర్లను లొంగదీసుకుని గెలవగలననే నమ్మకం కేసీఆర్ కి బలంగా ఉంది. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో అలాగే గెలిచాననే అహంకారం కూడా ఆయనలో కనబడుతోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఓటర్లకు రూ.2 వేల నుంచి రూ.3 వేల దాకా ఇచ్చి గెలిచారు. ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యతను కావాలనే పెంచారు. విచ్చలవిడిగా డబ్బు పంచి ఓటర్ ను కరెప్ట్ చేస్తే.. ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికి ఓటు వేయాలనే ఆలోచనకు వస్తాడనేది కేసీఆర్ సిద్ధాంతం. అందుకే గ్రాడ్యుయేట్స్ కి కూడా భారీగా డబ్బు పంచి రెండు స్థానాలను గెలుచుకున్నారు. నాగార్జునసాగర్ లో కూడా ఓటుకి రూ.2 వేలు పంచారు.
కేసీఆర్ కి ఇంత పెద్దఎత్తున డబ్బు ఎక్కడి నుండి వచ్చింది. ఏ ఎన్నికల్లోనైనా పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారు. అంత మొత్తంలో డబ్బును ఎలా సమకూర్చుకున్నారు. ఎక్కడ నుండి సమకూర్చుకున్నారు. ఎలా సాధ్యమైందని అందరూ అనుకుంటున్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భారీగా ముడుపులు ముట్టాయనే ప్రచారం ఉంది. అంతేకాదు భూముల కుంభకోణంతో పాటు పెద్ద పెద్ద కన్ స్ట్రక్షన్ కంపెనీలతో లోపాయికారి ఒప్పందం చేసుకోవడం ద్వారా కూడా పెద్దఎత్తున ముడుపులు ముట్టాయని తెలుస్తోంది. దీంతో కేసీఆర్ కు వేల కోట్లు వచ్చాయి. ఆ డబ్బుతో ఎన్ని ఎన్నికల్లో అయినా కొట్లాడవచ్చు అనే భావనతో ఉన్నారాయన. డబ్బుకు తోడు అధికారం ఉండడంతో అహంకారంగా వ్యవహరిస్తున్నారు.
హుజూరాబాద్ లో ఇప్పటికే పార్టీ పరంగా రూ.150 కోట్లు ఖర్చు చేసి ఉంటారు. ఎందుకంటే ఈటలతో వెళ్లిన ప్రజాప్రతినిధులను తిరిగి టీఆర్ఎస్ లోకి తెచ్చుకోవడానికి ఎవరికి ఎంత కావాలంటే అంత ఇచ్చి టీఆర్ఎస్ కండువా కప్పారు. మరోవైపు ప్రభుత్వ పరంగా దళిత బంధు పేరుతో రూ.500 కోట్లు విడుదల చేశారు. ఇవికాక రోడ్లు, ఇతర పనుల కోసం మున్సిపాల్టీలకు సుమారు రూ.500 కోట్లు ఇచ్చారు. కుల సంఘాల భవనాలకు స్థలాలను ఇవ్వడంతో పాటు బిల్డింగ్ నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. నిర్మాణానికి నిధులు.. మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు.. గొర్రెల పంపిణీ.. ఇలా అన్ని వర్గాలకు ఏదో ఒక రకంగా లబ్ధి జరిగేలా నిధులు రిలీజ్ చేశారు. దీన్నిబట్టి కేసీఆర్ కి ప్రజల మీద ప్రేమనో వారి ఓట్ల మీద ప్రేమనో అర్థం అవుతోంది.
ప్రజల మీద ప్రేమ ఉంటే ఎన్నికలతో సంబంధం లేకుండా ఈ పనులన్నీ చేసేవారు. కేవలం హుజూరాబాద్ లో గెలవడం కోసం.. ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారు. నిజంగా ప్రజలమీద ప్రేమ ఉంటే ఈ పనులన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేసేవారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల చైతన్యాన్ని నిర్వీర్యం చేసి డబ్బు ప్రాధాన్యత పెంచి… కుట్రలకు, కుతంత్రాలకు తెరలేపి.. నిరంకుశ విధానాలను నిర్బంధాన్ని అమలు చేస్తూ దొర పోకడలతో పాలన సాగిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో లేకుండా మంత్రులకు, ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వకుండా వన్ మ్యాన్ షో చేస్తూ.. అంతా తానై పాలన సాగిస్తూ… తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజలకు ఇప్పుడిప్పుడే అన్నీ అర్థం అవుతున్నాయి. హుజూరాబాద్ లో కేసీఆర్ జిమ్మిక్కులు పని చెయ్యవు. కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం