తెలుగు దేశం పార్టీకి ఓటు వేసిన వారికి ఫించను ఇస్తారా అంటూ 10 మంది వాలంటీర్లు రాజీనామా చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. తెలుగు దేశం పార్టీకి ఓటేశారన్న కారణంతో 13 మందికి పెన్షన్లు ఇవ్వకుండా మూడు నెలలుగా ఇబ్బంది పెట్టారు. లబ్దిదారులు గ్రామంలో నివసించడం లేదంటూ తప్పుడు నివేదికలు పంపారు. పెన్షన్ డబ్బులను తిరిగి ప్రభుత్వానికి జమ చేశారు. పెన్షన్లు అందరికీ ఇస్తూ తమకెందుకు ఇవ్వడంలేదని ప్రశ్నిస్తే.. ఆన్ లైన్‌లో తప్పుగా నమోదైందని మభ్య పెట్టారు. అనుమానం వచ్చిన బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వాలంటీర్ల నిర్వాకం బయటపడింది.
ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎంపీడీవో నర్సింహులు, ఈవో ఆర్డీ సుధాకర్ బాబు, కార్యదర్శి మాదురి లతా స్వయంగా పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు.ఇక్కడ విచిత్రమేంటంటే.. తెలుగుదేశం పార్టీ వాళ్లకు పెన్షన్లు ఎలా ఇస్తారంటూ వాలంటీర్లు రాజీనామా చేశారు. మరో వైపు టీడీపీ వర్గీయుల ఇళ్లకు నీటి సరఫరా కూడా నిలిపివేశారని గ్రామస్తులు చెబుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్రకాశం జిల్లాలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది.