వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో ఉద్యమమేనన్నారు కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్. ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన.. నిజాంసాగర్ చౌరస్తాలో ప్రసంగించారు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం లేదని.. కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారు.. ఊసే లేదు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదని మండిపడ్డారు.
లక్షమంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేశారన్న ఆయన… కొత్త నియామకాలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో మహిళలు, రైతులు, నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రజల్లో పెను మార్పు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisements
హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి.. బీజేపీ సత్తా ఏంటో చూపిద్దామన్నారు జవదేకర్. బండి పాదయాత్ర ఏడాదిన్నర పాటు కొనసాగుతుందని.. ఈసారి తెలంగాణలో వచ్చేది ముమ్మాటికీ పేదల ప్రభుత్వమేనని చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు మోడీ ఎన్నో పథకాలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు చేయకపోవడం వల్లే అనేకమంది చనిపోయారని ఆరోపించారు జవదేకర్.