ప్రధాని మోడీపై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడీ ప్రధాని అయ్యాక అదానీ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయన్నారు. పెట్టుబడి దారులకు ప్రధాని మోడీ కొమ్ము కాస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు.
సీపీఐ(ఎం) చేపట్టిన జనచైతన్య యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాల్లో బీజేపీ విఫలమైందన్నారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిందన్నారు. నలభై యాభై ఏండ్ల కిందట ఒక సామెత ఉండేదని చెప్పారు.
టాటా బిర్లాలకు కొమ్ము కాసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కమ్యూనిస్టులు డిమాండ్ చేసేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం అదానీ, అంబానీ సర్కార్‌ను కూల్చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ… ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా బీజేపీ తొమ్మిది ఏండ్లలో నెరవేర్చలేకపోయిందన్నారు.
బీజేపీది అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వమంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పెకిలించాలని బీజేపీ చూస్తోందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం మన దేశానికి పనికి రాదని బీజేపీ వాళ్లు చెబుతున్నారని ఆయన ఆరోపించారు.