ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలో ఇటీవల నిర్వహించిన మాతృభూమి ‘ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’లో ఆయన పాల్గొని కశ్మీర్ ఫైల్స్ సినిమాపై మండిపడ్డారు. ‘కశ్మీర్ ఫైల్స్’అర్థం పర్థం లేని సినిమా అంటూ ఆయన కాంట్రో వర్సికి తెర లేపారు.
అర్థం పర్థం లేని సినిమాల్లో కశ్మీర్ ఫైల్స్ కూడా ఒకటని ఆయన ఫైర్ అయ్యారు. ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా దీన్ని పట్టించుకోలేదన్నారు. ఆ సినిమాను ఎవరు నిర్మించారో మనందరికీ తెలుసన్నారు. ఇది నిజంగా సిగ్గులేనితనమని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
వాళ్లకు ఇంకా సిగ్గు రాలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాకు ఆస్కార్ ఎందుకు రాలేదని ఆ సినిమా డైరెక్టర్ ఇప్పటికీ అంటున్నారని ఆయన చెప్పారు. ఆస్కార్ కాదు కదా కనీసం ఆయనకు భాస్కర్ అవార్డు కూడా రాదని ఎద్దేవా చేశారు. ఇదో ప్రాపగాండా ఫిల్మ్ అని చెప్పారు.
ఇలాంటి ప్రచార చిత్రాలను నిర్మించేందుకు కొందరు భారీ పెట్టుబడులు పెట్టారని తెలిసిందన్నారు. దీని కోసం 2000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారని తనకు తెలిసిన వాళ్లు చెప్పారని ఆయన పేర్కొన్నారు. కానీ.. ప్రజల్ని ఎల్లప్పుడూ మోసపుచ్చలేరని ఆయన వ్యాఖ్యానించారు.