ఆయనో నటుడు. మేధావి. అభ్యుదయవాది. మతోన్మాదానికి వ్యతిరేకంగా గొంతెత్తి నినదించినవాడు, నినదిస్తున్నవాడు. అలాంటివాడు పవన్ కల్యాణ్ ని విమర్శించాడంటే పెద్దగా ఆశ్చర్యం లేదు. కాని టీఆర్ఎస్ కి ఓట్లేయమని జనానికి సలహా ఇస్తున్నాడు.. అదే ఆశ్చర్యకరం. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అరేంజ్ చేసి స్పాన్సర్ చేసిన ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్.. పవన్ కల్యాణ్ ఓ ఊసరవెల్లి అని.. బిజెపికి ఓట్లేయమని చెప్పడం ఆశ్చర్యపర్చిందని అన్నాడు. పవన్ నిర్ణయాలు నిలకడలేనివని.. రకరకాలుగా మారుతూ విలువ లేకుండా చేసుకుంటున్నాడని కామెంట్ చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కాని ఈయనేమో మరి టీఆర్ఎస్ కు ఓట్లేయమని సలహా ఇచ్చాడు. అదేంటో మరి.
పవన్ కల్యాణ్ ని మించిన ఊసరవెల్లి కేసీఆర్ అన్న సంగతి ప్రకాష్ రాజ్ కు తెలియదా.. లేక బిజెపి మీద వ్యతిరేకతతో ఇలా స్టేట్ మెంట్ ఇచ్చాడా లేక.. కేసీఆర్ స్పాన్సర్ షిప్ కు అట్రాక్ట్ అయ్యాడా.. ఏం జరిగిందో తెలియదు గాని.. ప్రకాష్ రాజ్ పవన్ ను అన్న మాటలు సంచలనమని.. అందుకు నాగబాబు ఘాటుగా రియాక్ట్ అవడం సెన్సేషన్ అని అనుకునేవారు.. అసలు సంచలనం ప్రకాష్ రాజ్ కేసీఆర్ కు ఓట్లేయమని చెప్పడమని గుర్తించాలి.
ఎందుకంటే ఇదే కేసీఆర్ మోదీకి భజన చేసిన విషయం మర్చిపోయినట్లున్నాడు ప్రకాష్ రాజ్. నోట్ల రద్దు, జీఎస్టీ విషయాల్లో కేసీఆర్ ఎలా ఊసరవెల్లిలా తన అభిప్రాయాలు మార్చుకున్నాడో తెలుసుకోవాలి. అలాగే అవసరం లేనప్పుడు కమ్యూనిస్టులు, వారు చెప్పే మాటలు పనికిరానివి. ఇప్పుడు సీటు కిందకు కమలం నీళ్లు వస్తుంటే భయమేసి.. వారి మాటలనే వల్లె వేస్తున్నాడు. పార్లమెంట్ లో ఎల్ఐసీ బిల్లుకు మద్దతిచ్చినవాడు.. నేడు ఎల్ఐసిని ఎవడైనా అమ్మేస్తాడా అని ప్రశ్నలు వేస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
రేపు కూడా అవసరమైతే బిజెపి కాళ్లు పట్టుకునేవాడు కేసీఆర్ అన్న సంగతి ఇంకా ప్రకాష్ రాజ్ కి అర్ధమవలేదనుకుంటా. పవన్ పార్టీ పెట్టాక బిజెపి, టీడీపీలకు తర్వాత కమ్యూనిస్టులతో.. మళ్లీ ఇప్పుడు బిజెపితో పొత్తు పెట్టుకుంటున్నాడు. మరి కేసీఆర్ సంగతి.. ? ముందు కాంగ్రెస్ తో పెట్టుకున్నాడు.. తర్వాత టీడీపీతో పెట్టుకున్నాడు.. ఆ తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది.. పార్టీ కలిపేస్తానని చెప్పి మరీ మోసం చేశాడు. చక్కగా అధికారంలోకి వచ్చాడు. అప్పటి నుంచి మాయమాటలతో దానిని నిలబెట్టుకుంటూ వస్తున్నాడు.. ఆ అధికారం తలకెక్కి తైతక్కలాడటంతో.. జనం బిజెపి వైపు చూస్తున్నారు.
బిజెపి వల్ల ప్రమాదం అని ప్రకాష్ రాజ్ లాంటి మేధావులు చెప్పినా ప్రజలు ఆగేలా లేరు. ఎందుకంటే వారికి కేసీఆర్ వల్ల ప్రమాదమేంటో కనపడిపోయింది. బిజెపి వల్ల ప్రమాదమేంటో ఇంకా తెలియదు, చూడలేదు. అందుకే కేసీఆర్ కి సరైన ఢీ జోడీ బిజెపి అని ఫిక్స్ అయిపోయారు. ప్రకాష్ రాజ్ లాంటివారు ఇలాంటి స్టేట్ మెంట్లు ఇచ్చేటప్పుడు.. ప్రతి ఒక్కరి చరిత్ర తెలుసుకుని ఇవ్వాలి. లేదంటే నవ్వులపాలవుతారు. అప్పుడు మీ కన్నా పవనే బెటరంటారు.