ప్రకాశ్ రాజ్… దక్షిణాధి భాషల్లో తనదో విలక్షణ నటన. నటనలోనే కాదు నిజ జీవితంలోనూ అంతే. సామాజిక అంశాలపై నిక్కచ్చిగా మాట్లాడటం, తనకు తప్పు అనిపిస్తే బహిరంగంగా వ్యాఖ్యానించటం, వర్తమాన రాజకీయాలతో పాటు సామాజిక-ఆర్థిక అంశాలపై అణగారిన వర్గాల పక్షాన స్పందిస్తూ ఉంటాడు.
కరోనా వైరస్ దెబ్బకు ఇండియా కూడా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుంది. లాక్ డౌన్ పేరుతో కరోనా వైరస్ ను నివారించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తుండటంతో… దినసరి కూలీలు, చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వారు ఇబ్బందికి గురవుతున్నారు.
దీంతో సామాజిక బాధ్యతగా పుదుచ్చేరి, ఖమ్మం, చెన్నైనుండి వచ్చిన వలస కూలీలకు తన ఫాంహౌజ్ లో ఆశ్రయం ఇచ్చారు. అంతేకాదు వారి కుటుంబాలతో ఫోన్ లో మాట్లాడి, కొంత ఆర్థిక సహాయాన్ని కూడా చేశారు. దేశం మొత్తం లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో… ప్రశాంత వాతావరణం ఏర్పడే వరకు ఆశ్రయం ఇస్తానని, ప్రభుత్వాలపై ఆధారపడటమే కాదు కొన్ని మనం కూడా చేయాలంటూ తన పుట్టిన రోజున ప్రకటన చేశారు.
అంతేకాదు… లాక్ డౌన్ ప్రారంభమైన రోజు కూడా ప్రకాశ్ రాజ్ తన ఉదారత చాటుకున్నారు. తన వద్ద పని చేసే ఉద్యోగులకు అందరికీ రెండు నెలల జీతాలు ముందుగానే ఇచ్చేసి, ఇంటికే పరిమితం కావాలని సెలవు ఇవ్వటం విశేషం.