మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందడి మొదలైంది. అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ప్రకాష్ రాజ్ తో పాటు ఆయన ప్యానల్ లోని సభ్యులు నామినేషన్ వేయగా… మంచు విష్ణు మంగళవారం దాఖలు చేయనున్నారు. సెప్టెంబర్ 29 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 30 పరిశీలన, అక్టోబర్ 1,2 తేదీల్లో ఉపసంహరించుకునే అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 10న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో పోలింగ్ జరగనుంది.
నామినేషన్ వేసిన సందర్భంగా ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాము ఒక అడుగు ముందే ఉన్నామన్నారు. ఇవి ఎన్నికలు కాదని.. కేవలం పోటీ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 3న తమ ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రెటరీగా నామినేషన్ వేసిన జీవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిరంజీవి మద్దతు విష్ణుకు కూడా ఉండొచ్చని చెప్పుకొచ్చారు.
మరోవైపు జనరల్ సెక్రెటరీ పదవికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో తాను రాకెట్ లా దూసుకుపోతానని చెప్పారు. తన విజయాన్ని ఎవరూ ఆపలేరని.. ఎంతోమంది ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. తాను గెలిస్తే కనీసం 100 మంది పేద కళాకారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానన్నారు బండ్ల గణేష్.