గోవా ముఖ్య మంత్రిగా ప్రమోద్ సావంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మైదానంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్టు తెలిపాయి. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు కానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
దాదాపు 10000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరుకానునట్టు అధికారులు అంచనావేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రితో పాటు ఎంత మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయంపై బీజేపీ శ్రేణులు స్పష్టత ఇవ్వడం లేదు.
ఇదే విషయాన్ని ప్రమోద్ సావంత్ ను అడగ్గా.. ఆ విషయం మీకు సోమవారం తెలుస్తుందని మీడియాతో అన్నారు. సోమవారం ఎంత మంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది తనకు ఇప్పుడు తెలియదన్నారు.
కొత్త మంత్రి వర్గంలో 11 మంది ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మార్చి 29న నూతన శాసన సభ రెండు రోజుల సమావేశానికి గవర్నర్ పీఎస్. శ్రీధరన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశాల్లో ప్రమోద్ సావంత్ విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు.