12 రోజులు.. లక్షల్లో భక్తులు.. ఎన్నో అవస్థలు.. పుణ్యస్నానాలకు మహారాష్ట్ర సిరొంచకు ప్రయాణం.. కుంభమేళా కన్నా అధిక ప్రాశస్తం ఉన్న ప్రాణహిత పుష్కరాలు సర్కార్ వైఫల్యంతో మొక్కుబడిగా సాగాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి వచ్చిన పుష్కరాలు అయినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు.. ప్రాణహిత నీళ్లపై ఆధారపడే లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ప్రభుత్వం. కానీ.. అదే ప్రాణహితకు పుష్కరాలు వస్తే కాళేశ్వరం దగ్గర సరైన చర్యలు తీసుకోకపోవడంపై మండిపడుతున్నారు భక్తులు.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం.. మంచిర్యాల జిల్లా అర్జున గుట్ట, వేమన పల్లి, దేవులవాడతో పాటు, ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి, మహారాష్ట్ర సిరొంచ దగ్గర ఈనెల 12 నుంచి 24 వరకు ప్రాణహితకు పుష్కరాలు కొనసాగాయి. అయితే.. మహారాష్ట్రలో ఘనంగా ఏర్పాట్లు జరగగా.. తెలంగాణ ప్రాంతాల్లో నామమాత్రంగా సాగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస అవసరాలు తీర్చేందుకు కూడా ఏర్పాట్లు చేయకుండా ప్రాణహిత నదిని ప్రభుత్వం అనాధలా వదిలేసిందని భక్తులు మండిపడుతున్నారు.
పుష్కర ఘాట్లు గతంలో ఉన్నవే. వాటిని అభివృద్ధి చేసిందేమీ లేదు. భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, మహిళలు బట్టలు మార్చుకునే ఏర్పాట్లు సరిగ్గా జరగలేదు. దీనికితోడు రోడ్లకు మరమ్మతులు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. 8 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అదే సెంటిమెంట్ ను వాడుకుంటున్న టీఆర్ఎస్.. తమ హయాంలో ప్రాణహిత పుష్కరాలను ఎందుకు ఘనంగా నిర్వహించలేకపోయిందని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుష్కరాల కోసం రూ.10 కోట్లు వెచ్చించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే.. ఈ పదేళ్లలో ఎన్నో మార్పులు జరిగాయి.. పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.100 కోట్లు కేటాయించినా తక్కువే అవుతుంది. కానీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఖాజానా నుంచి విడుదల చేసిన నిధులు అంతంతమాత్రమేనని ఇటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. భూపాలపల్లిలో 49 లక్షలు, మంచిర్యాలలో 70 లక్షలు వెచ్చించి తూతూమంత్రంగా పుష్కరాలు జరిపించేశారు. ఎగువన ఉన్న మహారాష్ట్ర రూ.10 కోట్లు వెచ్చించి రాష్ట్ర పండుగగా గుర్తించి పుష్కరాలను ఘనంగా జరిపింది. వీఐపీ ఘాట్స్ కూడా ఏర్పాటు చేసింది.
పుష్కరాల సమయంలో ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తుంటారు. కానీ.. ప్రాణహితకు మాత్రం అలా జరగలేదు. దీనికి కోటపల్లి మండలం అర్జునగుట్ట ఘాట్ దగ్గర జరిగిన సంఘటనే ఉదాహరణ. విశాఖకు చెందిన సోమేష్ అనే వ్యక్తం పుణ్యస్నానం కోసం వచ్చి చనిపోయాడు. ఘాట్స్ దగ్గర సరైన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దయనీయ స్థితిలో పుష్కరాలు నిర్వహిస్తారా? అంటూ ఫైరవుతున్నారు. అసలే సూర్యుడు నిప్పులు కక్కుతున్న ఈ సందర్భంలో భక్తులకు కనీసం నిలబడేందుకు చలువ పందిళ్ళు కూడా వేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అంటున్నారు.